గోదావరి బోటు ఘటన మరో టైటానిక్ కానుందా?

గోదావరిలో మునిగిన బోట్ ను వెలికితీయడం సాధ్యమేనా అనే అంశం పై ఎప్పటినుంచో ఉత్కంఠం చెలరేగుతోంది.పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తోన్న ధర్మాడి సత్యం బృందం తన లక్ష్యాన్ని చేదిస్తుందా అంటే ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితిలా ఉంది. బోట్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ ఒప్పుకొన్న ధర్మాడి సత్యం బృందం తొలిసారి ప్రయత్నించి విఫలమైంది. కచ్చులూరు సమీపంలో లంగరులు వేసి బోట్ ని గుర్తించిన ధర్మాడి సత్యం టీమ్ దాన్ని బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మధ్యలో ఐరన్ రోప్ తెగి పోవడంతో ఆపరేషన్ కి బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో గోదావరిలో వరద ఉధృతి తగ్గక పోవటం వర్షాల బీభత్సం కూడా తోడవటంతో తొలి దశ ప్రయత్నం విఫలమైంది. 

అయితే ఇప్పుడు నదిలో వరద కాస్త తగ్గడం వర్షాల కూడా లేకపోవటంతో సత్యం బృందం రెండోసారి ఆపరేషన్ ని మొదలు పెట్టింది. నిన్న సాయంత్రం ధర్మాడి సత్యం బృందం కచ్చులూరుకు చేరుకొంది. సత్యంతో పాటు ఈ బృందంతో ఇరవై ఐదు మంది ఎక్స్ పర్ట్స్, మరో ఇరవై ఐదు మంది మత్స్యకారులు పాల్గొంటున్నారు. అంతేకాదు ఓ భారీ ప్రొక్లైనర్, పంటు, ఓ బోటును కూడా తీసుకువచ్చారు.

పంటును తీసుకుని నదిలోకి వెళ్లిన ధర్మాణి సత్యం బృందం ఐరన్ రోప్ లకు లంగర్లను తగిలించి నీళ్లలోకి వదులుతోంది. అయితే రెండోసారి ఆపరేషన్ కూడా మళ్లీ మొదటి నుంచే మొదలు పెట్టాల్సి వచ్చింది. గోదావరిలో నీరు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బోటు యథాస్థానంలోనే ఉందా మరో స్థానానికి కదిలివెళ్లిందా అన్నది తెలియాల్సి ఉంది. దీంతో ముందు సత్యం టీమ్ బోటును కనిపెడితే ఆ తరవాత దాన్ని లాగే ప్రయత్నాలు మొదలవుతాయి.

నీళ్ళల్లో మునిగిన బోట్లు వెలికితీయడంలో ధర్మాడి సత్యం టీమ్ ముప్పై ఏళ్ళ అనుభవముంది. బాలాజీ మెరైన్స్ పేరుతో ఇప్పటికే అనేక క్రిటికల్ ఆపరేషన్స్ ను చేపట్టాడు ధర్మాడి సత్యం. గతంలో బలిమెలలో మునిగిన నావను వెలికితీసింది కూడా ధర్మాడి సత్యం బృందమే, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు కచ్చులూరులో మునిగిన బోటును బయటకు లాగేందుకు అంగీకరించారు అధికారులు. అన్నీ కలిసొస్తే ప్రకృతి సహకరిస్తే రెండ్రోజుల్లో ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సెప్టెంబరు 15 వ తేదీన రాయల్ వశిష్ట బోట్ గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో డెబ్బై ఏడు మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రాణాలతో బయటపడ్డది కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే, ఇంకా ఆచూకీ తెలియాల్సి వారి సంఖ్య పద్నాలుగుగా చెబుతున్నారు అధికారులు. ఈ పద్నాలుగు మంది మృతదేహాలు బోటుతో పాటు నీళ్లలోనే ఉంటాయన్నది ఒక అంచనా. ఆపరేషన్ వశిష్ట రెండో భాగం విజయవంతమైతే తప్ప ప్రమాద సమయంలో బోట్ లో ఎంతమంది ఉన్నారన్న లెక్క కూడా తేలే అవకాశం కనిపించట్లేదు. గోదావరిలో నీరు అధికంగా ఉండటం బోటు మునిగిన ప్రాంతాల్లో సుడులు ఎక్కువగా ఉండడం వల్లే మొదటి ప్రయత్నం విఫలమైందని చెబుతోంది ధర్మాడి సత్యం బృందం. ప్రస్తుతం గోదావరిలో నీటి ఉధృతి కాస్త తగ్గిందని పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయని అంటోంది. అన్నీ కలిసొస్తే బోటును బయటకు లాగడం సులభమని అంటోంది ధర్మాడి సత్యం బృందం.ఈ రోజు ఐనా బోటు బయటకు లాగడం సాధ్యమా కాదా అన్నది వేచి చూడాలి.