తెలంగాణ కాంగ్రెస్ లో ఒకే కులానికి పెద్ద పీట

 

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెరాసని గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తుంది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వచ్చేలా ఉందని అధిష్టానం భయపడుతుంది.. సమిష్టిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, ఎవరికివారు పార్టీకి నేనే పెద్ద దిక్కు, నేనే సీఎం అవుతా అంటున్నారు.. దీనికితోడు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కొందరు, పార్టీ రాష్ట్ర ఇంచార్జిని మార్చాలని మరికొందరు.. వీటితో ఏం చేయాలో పాలుపోక, పరిస్కార మార్గం కోసం అన్వేషణలో ఉన్న అధిష్టానానికి మరో షాక్.. 

సీనియర్ నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు.. ఆయన పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీ తీరుపైన, నాయకత్వం పైన విమర్శలు చేసారు.. గ్రేటర్ లో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా సొంత ఇంటి పనిలా తన భుజాలపైనే వేసుకుని పని చేశానని, అలాంటిది గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే ఎవరెవరికో అనామకులకి టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెప్పానని అన్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు.. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు.. అందుకే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని దానం అన్నారు.. 

ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నిర్వహించిన బస్సు యాత్రలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు.. ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నా కొందరు నేతలు ఆయన్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించిన దానం.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని , ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు.. మరి దానం చేసిన ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం ఆరోపణలకు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.