TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజనర్సింహ‌ను సైడ్‌ చేస్తోంది అందుకేనా? మాజీ డిప్యూటీ... పార్టీ మారడం ఖాయమేనా?

Published on: Mon Jun 12, 2017 2:32PM

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ రాష్ట్ర విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన దామోదర రాజనర్సింహకు... మొన్నటి రాహుల్ సభలో ప్రాధాన్యత దక్కకపోవడానికి కారణమేంటో తెలిసింది. రాష్ట్ర విభజనకు ముందు ఢిల్లీలో జరిగిన పలు కీలక మీటింగ్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పాల్గొన్న దామోదర రాజనర్సింహ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే రాష్ట్ర విభజన విషయంలో కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పుదోవ పట్టించారని ఆలస్యంగా గ్రహించిన హైకమాండ్‌... పలువురి విషయంలో కోపంగా ఉందని, ఆ లిస్ట్‌లో దామోదర రాజనర్సింహ కూడా ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది.

 

మరోవైపు దామోదర రాజనర్సింహ... బీజేపీ వైపు చూస్తున్నారనే సమాచారం కాంగ్రెస్‌ హైకమాండ్‌‌కి ఉప్పందిందని అంటున్నారు. రాహుల్‌ సంగారెడ్డి మీటింగ్‌కి ముందు తెలంగాణలో పర్యటించిన బీజేపీ చీఫ్‌ అమిత్‌షాను రాజనర్సింహ రహస్యంగా కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అంతేకాదు అమిత్‌షా తెలంగాణ పర్యటనకు రాకముందే... రాష్ట్ర బీజేపీ నేతలు దామోదరతో చర్చలు జరిపారని, అయితే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో భేటీ అసంపూర్తిగా ముగిసిందని, ఇదంతా హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిందని అంటున్నారు.

 

అయితే అమిత్‌షా తెలంగాణ పర్యటన సమయంలోనే దామోదర రాజనర్సింహ... బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా... చర్చల్లో ప్రతిష్టంభనతో ఆగిపోయిందని, కానీ ఏదో ఒకరోజు ఆ పార్టీలోకి జంప్‌ చేయడం ఖాయమనే నిర్ణయానికి టీకాంగ్రెస్‌ వచ్చిందని, అందుకే రాజనర్సింహకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారే టాక్‌ వినిపిస్తోంది. అందులో భాగంగానే దామోదర రాజనర్సింహకు... రాహుల్‌ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.