దళిత బంధు రివర్స్ ఎఫెక్ట్.. కేసీఆర్‌కే బూమరాంగ్!?
Published on: Wed Mar 30, 2022 3:10PM
దళిత బందు పథకంపై దళితుల కంటే ముఖ్యమంత్రి కేసీఆరే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అదేంటి, దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశలు పెట్టుకోవడం ఏమిటి? అంటారా, అవును ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర సంక్షేమ పథకాలు అన్నిటికంటే, దళితబంధు పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అందుకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించక పోయినా,అప్పుల్లో అప్పు ఇంకో అప్పు తెచ్చి అయినా,జనంలో దళితబంధు ఆశలను సజీవంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కొంచెం చాలా ఎక్కువ శ్రద్దే తీసుకున్నారు. నిజంగా ఖర్చు చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, బడ్జెట్’లోనూ నిధులు దండిగా కేటాయించారు.
అయితే, అదేమిటో కానీ, దళితబందు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్’కు,తెరాసకు అంతగా అచ్చివచ్చినట్లు లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఎలాగైనా ఈటల రాజేందర్’ను ఓడించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబందు పథకాన్ని పైకి తెచ్చారు. ఎన్నికలకు ముందు ఆ నియోజక వర్గంలోనే పైలట్ ప్రాజెక్ట్’ను ప్రారంభించారు. అయినా, హుజురాబాద్’లో ఏమి జరిగిందో వేరే చెప్పనక్కరలేదు. అక్కడి నుంచే దళితబంధు దగాబంధు అనే ముద్ర అయితే పడింది కానీ, ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రతిష్టను పైసా ఎత్తుకుడా నిలబెట్టలేక పోయింది. దళితబంధుతో పాటుగా ఏ పథకమూ పనిచేయలేదు. ఇంచుమించుగా రూ. 600 కోట్ల వరకు ఖర్చు చేసినా, ఫ్యామిలీకి రూ.10 లక్షలు ఇచ్చే దళితబందును ఎరగా వేసినా, చివరకు ఏమి జరగాలో అదే జరిగింది. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్’ మాత్రం దళితబంధు మీద ఆశలు వదులుకోలేదు. అందుకే, ఆశించిన రేంజ్’లో కాకపోయినా, దళితబందు పథకం సజీవంగా ఉంచేందుకు ప్రతి నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే, మళ్ళీ ఇక్కడా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆశలకు సొంత పార్టీ నేతలే గండి కొడుతున్నారనే వార్తాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, వేరే ఎవరికో ఇవ్వడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ, అవకాసం ఉన్న మేరకు ఆ పది లక్షలు కూడా తమ ఖాతాలలోనే వేసుకున్నారు.తమ కుటుంబ సభ్యులకో లేందంటే తమ బందువర్గానికో ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి, రాజకీయ లబ్ది కోసమే ఈ పథకం తెచ్చారు కాబట్టి లబ్దిదారుల ఎంపిక జాబితాను ఖరారు చేసే అధికారం ఎమ్మెల్యేలకే ఇచ్చారు. ఎమ్మెల్యేలేమో, అయిన వారితో జాబితా నింపుతున్నారు. ఒక్కొక్క నియోజక వర్గంలో వందమంది లబ్దిదారులను ఎంపిక చేస్తే అందులో 90 మందికి పైగా, కొన్ని నియోజక వర్గాల్లో వందకు వందమంది ఎమ్మెల్యేల బంధువులు కాదంటే అనుచర గణాలే ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తన తమ్ముడికే దళిత బంధు ఇచ్చేశారు. అదేమంటి, దళితులు అందరికీ దళిత బందు అని ముఖ్యమంత్రి చెప్పలేదా అని బుకాయిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజయ్య రాచబాటలో అదే పనిచేశారు. ఫ్యామిలీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పేదోడు లాస్ట్’ ప్రిన్సిపుల్ ఫాలో అయ్యారనే ఆరోపణలు సోసిఅల మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెరాస ఎమ్మెల్యేల తీరుతో దలిత బందు లక్ష్యమే కాదు, ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలనే ముఖ్యమంత్రి ఆశలకు కూడా గండిపడుతోందని అంటున్నారు. ఎమ్మెల్యేల తీరుతో ఈ పథకం వల్ల టీఆర్ఎస్‌కు వస్తున్న లబ్ది కంటే… నష్టమే ఎక్కువ ఉంటుందని టీఆర్ఎస్ నేతలే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. దళిత సంఘాలు అయితే, ఇంతవరకు ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితాలను రద్దుచేసి గ్రామ సభల్లో పారదర్శకంగా, అంత్యోదయ (పూరెస్ట్ ఆఫ్ ద పూర్) పద్దతిలో లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వనక ఇతర సామాజిక వర్గాల నుంచి తమకు కూడా ‘బందు’ కావాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అందుకే,దళితబందు వలన వ్రతం చెడినా ఫలితం దక్కలేదనే మాటే తెరాస వర్గాలో వినవస్తోంది.


