పురందేశ్వరికిపనిలేకుండా చేస్తున్న రేణుకాచౌదరి?
Published on: Tue Mar 20, 2012 10:49AM
కేంద్ర మానవ వనరులశాఖ సహాయమంత్రి పురందేశ్వరి ప్రస్తుతం పనీపాటా లేకుండా కాలక్షేపం చేస్తున్నారట. దీనికి ప్రధాన కారణం క్యాబినెట్ మంత్రిగా ఉన్న కపిల్ సిబాల్ వ్యవహారశైలి. గతంలో అర్జున్ సింగ్ మానవ వనరులశాఖ క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిత్యం ఆనారోగ్యంతో బాధపడ్డారు. అప్పుడు సహాయమంత్రిగా ఉన్న పురందేశ్వరి మొత్తం బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉండేవారు. సహాయమంత్రిగా ఆమె దాదాపు 50 దేశాల్లో పర్యటించారు. అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఆమె ప్రసంగాలను విదేశీ ప్రభుత్వాధిపతులు సైతం అభినందించారు.
సోనియాగాంధీ కూడా ఆమెను ప్రశంసించారు. అర్జున్ సింగ్ తరువాత కపిల్ సిబాల్ కేంద్ర మానవ వనరులశాఖ క్యాబినెట్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కపిల్ సిబాల్ అన్ని వ్యవహారాలను తానే చూస్తున్నారు. పురందేశ్వరికి కేవలం రెండు శాఖల వ్యవహారాలను మాత్రమే అప్పగించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ఆమెను కపిల్ సిబాల్ విదేశాలకు కూడా పంపలేదు. ఈ విషయాన్ని ఆమె ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ కి చెప్పినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయిందని తెలిసింది. అయితే పురంధేశ్వరికి పనిలేకుండా చేయడం వెనుక మరో కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి హస్తం ఉన్నట్లు ఢిల్లీలో పుకార్లు వ్యాపించాయి. రేణుకాచౌదరి కపిల్ సిబాల్ తో సన్నిహితంగా ఉంటారు. ఈ సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న పురంధేశ్వరికి ఆమె చెక్ పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇంత జరుగుతున్నా పురంధేశ్వరి మాత్రం నిగ్రహంతోనే వ్యవహరిస్తున్నారు.. ఎక్కా తన బాధను వ్యక్తం చేయడం లేదు.


