టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలు!!

 

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్‌ తో కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. జగన్ పాలన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని దాడి తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో తానుగానీ, తన కుమారుడు రత్నాకర్‌గానీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. నాలుగేళ్ల తర్వాత వైసీపీలోకి రావడం సొంతింట్లోకి వచ్చినట్టుందన్నారు. అప్పట్లో కొన్ని స్థానిక సమస్యల కారణంగా వైసీపీని వీడాల్సి వచిందని చెప్పారు.

టీడీపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. అధికారమే పరమావధిగా ప్రజస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారా అని దాడి ప్రశ్నించారు. ప్రస్తుతమున్నది తెలుగుదేశం పార్టీ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు జతకట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీని అనుబంధ సంస్థగా మార్చేశారని విమర్శించారు. టీడీపీని రాహుల్ గాంధీ పాలిస్తున్నారో.. చంద్రబాబు పాలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏ క్షణంలోనైనా టీడీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దాడి జోస్యం చెప్పారు. చంద్రబాబుకు కావాల్సింది కేవలం పవర్ మాత్రమేనని సిద్ధాంతాలు ఆయనకు అవసరం లేదన్నారు. చంద్రబాబు ప్రజలను నమ్మించడానికి రోజుకో ప్రకటనలు చేస్తారని.. టీడీపీ ఆశయాలను గాల్లోకి కలిపేసిన వ్యక్తి చంద్రబాబు అని దాడి విమర్శించారు.