స్వంత పార్టీ మీదే ‘దాడి’ ఏలయా?

 

రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు, కాంగ్రెస్ పార్టీతో వైకాపాకున్నఅనుబంధాలను ఎంత వదిలించుకొందామని ప్రయత్నించినా, అది నక్షత్రకుడిలా జగన్మోహన్ రెడ్డి వెంటపడుతూనే ఉంది. కొద్ది వారాల క్రితం కాంగ్రెస్ యంపీ సబ్బం హరి ఇక నేడోరేపో ఎలాగు వైకాపా కండువా కప్పుకోబోతున్నాను కదా అనే అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీననే సంగతి మరచి, మా పార్టీ (వైకాపా) వచ్చే ఎనికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించేసి, కాంగ్రెస్-వైకాపాల దోస్తీని ఖరారు చేసేసారు. దానితో ఆయన వైకాపా కండువా కప్పుకొనే భాగ్యం లేకుండా పోయింది.

 

ఒకవైపు తెలుగుదేశం అదే పాట పదే పదే పాడుతూ ఇబ్బంది పెడుతుంటే, మరో వైపు కాంగ్రెస్ యంపీలు లగడపాటి, హర్షకుమార్ తదితరులు కూడా సోనియమ్మా దత్తపుత్రుడిని చూసుకొని స్వంత కొడుకులవంటి తమని అన్యాయం చేసేస్తోందని మొత్తుకోవడం జగన్ బాబుకి గొప్ప సంకట పరిస్థితి కల్పించింది. తెదేపా ఆరోపణలను ఒట్టి గాలి కబుర్లని తేలికగా తీసి పడేస్తున్నా, నిఖార్సయిన కాంగ్రెస్ యంపీలే తనకి దత్తపుత్రుడు హోదా ఇచ్చేయడంతో ఆయన చాలా అనీజీగా ఫీలయిపోతున్నారు.

 

సరిగ్గా ఇటువంటి తరుణంలోనే, (రెండోసారి కూడా తనకే యంయల్సీ టికెట్ కన్ఫర్మ్ చేయనందుకు తెదేపాతో ఉన్న ముప్పైఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచేసుకొని వైకాపాలోకి దూకిన) దాడి వీరభద్రరావు, తనని ఆపత్సమయంలో ఆదుకొన్న వైకాపా కూడా ఇప్పుడు ఆపత్సమయంలో ఉందని భావించి, దాని ఋణం తీర్చుకోవాలనే సత్సంకల్పంతో “జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటిస్తే సోనియా గాంధీ ఆయనను మోసం చేసి జైల్లో పెట్టించేసింది. అందువల్ల ఇక మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు,” అని ప్రకటించేశారు.

 

కానీ జనానికి వారిని నమ్ముకొన్న జగన్ కి మాత్రం ఆయన మాటలు వేరేలా అర్ధం అయ్యేయి. అసలు ఆయన వైకాపాపై వస్తున్నఆరోపణలు ఖండిస్తున్నారా లేక నిజమేనని దృవీకరిస్తున్నారా అనే అనుమానం కలిగింది. ఎందుకంటే జగన్ సోనియాను నమ్మడం, కాంగ్రెస్ కు మద్దతు పలకడం గురించి ఇప్పుడు ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో వైకాపకు గానీ జగన్మోహన్ రెడ్డి కి గానీ ఎటువంటి సంబందమూ లేదని ఎంత గట్టిగా నొక్కి వక్కాణిస్తుంటే అది గోడకి కొట్టిన బంతిలా ఇంకా అనుమానాలు పెంచుతోంది తప్ప తగ్గించడం లేదు. దీనితో మన స్వంత పార్టీ మీదనే ఈ దాడి ఏలయా? అంటూ జగన్, దాడి మాష్టారుకి క్లాసు పీకినట్లు సమాచారం.

 

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవలన్నట్లు, కండువా ఉండగానే మాట దిద్దుకోవడం మేలని, దాడి మాష్టారు మరో సవరణ స్టేట్మెంట్ ఇచ్చేరు. “ఎప్పుడో మూడేళ్ళ క్రితం జగన్ బాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం. ఆయన కాంగ్రెస్ లోంచి జంపయిపోయి వైకాపా పెట్టినందుకే 16నెలల అజ్ఞాత వాసం చేయవలసి వచ్చింది.అయినప్పటికీ ఆయన మాత్రం ఏనాడు తనను కరుణించమని సోనియమ్మను ప్రాదేయపడలేదు. కావాలంటే ఆయన కోట్ చూడుడి: “ఇది కడప పౌరుషానికి డిల్లీ అహంకారానికి మధ్య జరుగుతున్నయుద్ధం... డేటెడ్ సో అండ్ సో,” అని ఉదాహరణతో సహా సవరణ ఇచ్చేరు.

 

అయినప్పటికీ ఆయన తాజా స్టేట్మెంట్ కూడా ‘రెండు పార్టీల మధ్య లింకులు కలిగే యున్నవి’ అని చెపుతున్నట్లే ఉంది తప్ప వాటిని ఖండిస్తున్నట్లు మాత్రం లేదు. మరి దాడి మాస్టారి కండువా కూడా ఎప్పుడయినా జారిపోయేలానే కనిపిస్తోంది. జర కండువా భద్రం మాష్టారు.