అవును కాంగ్రెస్ ను నమ్మి మోసపోయాము: దాడి

 

కాంగ్రెస్ యంపీ సబ్బం హరి ఇంకా వైకాపాలో చేరక ముందే, “వైకాపా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని” ప్రకటించినందుకు ఆయన మొహం మీదనే వైకాపా తలుపులు వేసేసి, ఆయనతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని తెగతెంపులు చేసుకొంది. అసలే కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఆవిధంగా ఆగ్రహించడం సహజమే.

 

కానీ ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో నేత దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ “సోనియాను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించారని, ఆమెను నమ్మి జగన్ మోసపోయారని, అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని,” అనడం చూస్తే ఆయన వైకాపాపై వస్తున్నఆరోపణలు ఖండిస్తున్నారా లేక నిజమేనని దృవీకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జగన్ సోనియాను నమ్మడం, కాంగ్రెస్ కు మద్దతు పలకడం గురించి ఇప్పుడు ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నారు.

 

ఎందువల్ల అంటే వైకాపా చేస్తున్న సమైక్యఉద్యమం వల్ల పార్టీకి సీమాంద్రాలో ఆశించినంతగా స్పందన రాకపోవడానికి ప్రధాన కారణం, తమ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలేనని అనేకమంది నేతలు అభిప్రాయ పడుతున్నందున, బహుశః దాడి వీరభద్రరావు ద్వారా ఆ అనుమానాలు నివృత్తి చేయాలని వైకాపా ఉద్దేశ్యం కావచ్చును. కానీ, ఆయన ఇచ్చిన వివరణ మూలంగా ఉన్నఅనుమాలు నివృత్తి కాకపోగా అవి మరింత బలపడేందుకు దోహదపడింది. అందువల్ల సబ్బం హరికి ఎదురయిన అనుభవమే ఇప్పుడు దాడికి కూడా ఎదురవబోతోందా? వేచి చూడాల్సిందే.