విశాఖలో దోపిడీ దొంగల బీభత్సం
Published on: Thu Oct 4, 2012 1:04PM
.png)
విశాఖను దోపిడీ దొంగలు గజగజ లాడిస్తున్నారు. పూటకో దొంగతనం చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు .చైన్ స్నాచింగ్‌లు, కిడ్నాపులు, సైబర్‌నేరాలు, వైట్ కాలర్ నేరాలు సర్వ సాధారణ మయిపోయాయి. పూటకో చిట్‌ఫండ్ సంస్థ ప్రజల డబ్బుతో బోర్డు తిప్పేస్తున్నారు. ఇదివరలో విశాఖపట్టణం మామూలు పట్టణంలాగానే వుండేది అయితే ప్రభుత్వం గ్రేటర్ విశాఖగా మార్చిన తర్వాత విశాఖ పరిధి విస్తరించింది. పరిశ్రమలు పెగిగాయి నగర జనాభా 20 లక్షలకు చేరింది. అయితే అందుకు తగ్గట్టుగా పోలీస్ స్టేషన్లు పెరగలేదు. అందునా నగర శివార్లలో మరీ తక్కువగా పోలీస్ స్టేషన్లు ఉండటంతో దొంగలు విజృంభిస్తున్నారు. ఇదివరలా తాళాలేసిన ఇళ్లను మాత్రమే దోచుకొనడంలేదు. పగలు ఇంట్లో అందరూ ఉండగానే వారు భయోత్పాదం సృష్టించి అందినంతా దోచుకుంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న నగల దుకాణంలో పట్టపగలు దుకాణ యజమానిని తీవ్రంగా గాయపరచి బంగారం ఎత్తుకు పోయారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని కొడుకును తీవ్రంగా గాయపరచి వారు పెద్దఎత్తున నగదు, నగలు దోచుకున్నారు. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని కొడుకు హత్యకు గురిఅయ్యారు. అడపాదడప పోలీసులు వచ్చి బెంగాల్, మహారాష్ట్ర , ఇరానీ, బీహారీ దోపిడి దొంగల ముఠా అని చెబుతూ నలుగురిని అరెస్టు చేసి మీడియా ముందుకు తెస్తున్నారు తప్ప కట్టు దిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు సరికదా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమీషనర్ పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దోపిడి దొంగలనుండి సత్వరమే రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు.


