డీఎస్ చూపు.. బీజేపీ వైపు.!!

'అత్తింట్లో పడలేక, పుట్టింటికి వెళ్లలేక' అన్నట్టుంది ప్రస్తుతం తెలంగాణ సీనియర్ నేత డీఎస్ పరిస్థితి.. అప్పట్లో కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన డీఎస్, తరువాత తెరాసలో చేరారు.. తెరాస ఆయనికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది.. కానీ ఎందుకో పార్టీ నేతలు ఆయన తీరుపట్ల సంతృప్తిగా లేరు.. డీఎస్ కూడా పార్టీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే నిజామాబాద్ తెరాస నేతలు డీఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.. ఇక అప్పటినుండి డీఎస్, తెరాసను వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఒకటే వార్తలు.

 

 

డీఎస్, కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు.. ఇక రేపో మాపో పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.. డీఎస్ మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు..  అయితే ఇప్పుడు డీఎస్ కాంగ్రెస్ కాదు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ఈ మాట స్వయంగా కాంగ్రెస్ నేతలే అంటున్నారు.. తాజాగా ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ మాట్లాడుతూ.. తెరాసలోని రాజకీయాల వల్లే డీఎస్ లుకలుకలు తెరమీదకు వచ్చాయని.. ప్రణబ్ ముఖర్జి, సోనియాగాంధీలను డీఎస్ కలిశారనేది తప్పుడు ప్రచారమని తెలిపారు.. డీఎస్ బీజేపీలోకీ వెళుతున్నట్లు నాకు సమాచారం ఉందని మధుయాష్కి అన్నారు.. మరి డీఎస్ అత్తిల్లు తెరాసను వీడి, అందరూ అనుకుంటున్నట్టు పుట్టిల్లు కాంగ్రెస్ లోకి వెళ్తారో లేక బంధువుల ఇల్లు బీజేపీకి వెళ్తారో చూద్దాం.