TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎండ‌ల్లో హాయ్ హాయ్‌.. వాన‌ల‌తో జాయ్ జాయ్‌..

Published on: Sun May 16, 2021 1:45PM

మొన్న‌టి దాకా ఫుల్ ఎండ‌. హాట్ హాట్ స‌మ్మ‌ర్‌. రెండు రోజుల నుంచి కూల్ కూల్‌. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వ‌ర్షాలు. వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చల్ల‌బ‌డింది. చెదురుమొదురు వాన‌లు, చ‌ల్ల‌టి గాలుల‌తో జ‌న‌మంతా సేద తీరుతున్నారు. ఎండ‌ల్లో హాయ్ హాయ్ అంటూ.. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటూ.. వెద‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇలా ఎండ‌ల్లో వాన‌ల‌కు తౌక్తా తుఫానే కార‌ణం. ఎక్క‌డో గోవా తీరంలో పొంచి ఉండి.. మ‌రో రెండు రోజుల త‌ర్వాత గుజ‌రాత్ తీరాన్ని దాట‌నున్న తుఫాను వ‌ల్లే.. ఇలా మండే ఎండాకాలం.. స‌డెన్‌గా చ‌ల్ల‌టి వానాకాలంగా మారిపోయింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌.. ఇలా తెలంగాణ‌, ఏపీలో అనేక చోట్ల చిన్న‌పాటి వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. 

తెలంగాణలో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. యానాం, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. 

అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం తౌక్తా తుపాన్‌గా మారింది. ఈ నెల‌ 18న గుజరాత్ ద‌గ్గ‌ర‌ తౌక్తా తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై తుపాన్ అధిక ప్రభావం చూపనుంది. ప్ర‌ధానంగా ఈ 5 రాష్ట్రాల‌పైనే తుఫాను తీవ్ర‌త క‌నిపిస్తున్నా.. తెలుగు రాష్ట్రాల‌పైనా ఎంతోకొంత ప్ర‌భావం చూప‌నుంది. ఈ తుఫాను కార‌ణంగా ఇప్ప‌టికే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డి, వాన‌లు కురుస్తున్నాయి. అయితే, వాన‌లు పెరిగితే మాత్రం రైత‌న్న‌ల‌కు న‌ష్టం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇప్ప‌టికే గాలులు, వాన‌ల వ‌ల్ల మామిడి రైతులు న‌ష్ట‌పోతున్నారు. వ‌ర్షాలు ఇంకా ఎక్కువైతే.. వివిధ పంట‌ల‌కు, మార్కెట్లో అమ్మ‌కాల‌కు తీవ్ర న‌ష్టం త‌ప్ప‌క‌పోవ‌చ్చు.