రిగ్గింగే బీజేపీ గెలుపుకి కారణం.. బయటపడుతుందన్న భయంతో మర్డర్లు!!

 

ఎన్నికల్లో గెలిస్తే ప్రజల అండ మా పార్టీకి ఉంది కాబట్టే గెలిచామని, ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే ఓడిపోయామని చెప్పుకోవడం కొన్ని పార్టీలకు అలవాటు. ఇప్పటికే విపక్షాలు బీజేపీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ సైబర్ నిపుణుడు కూడా చేరిపోయాడు. 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ సాధించిన విజయాలన్నీ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే సాధ్యమైందని పెద్ద బాంబు పేల్చాడు. అమెరికాలో తలదాచుకుంటున్న సయ్యద్‌ షుజా అనే భారతీయ హ్యాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్‌ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహకరించిందని తెలిపారు. అయితే ఇక్కడో అర్థంకాని విషయం ఏంటంటే.. 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్‌ నుంచే అవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఆ లాజిక్ పక్కన పెట్టి మిగతా మేటర్ లోకి వెళ్దాం.

సయ్యద్‌ షుజా సోమవారం లండన్‌లో భారత పాత్రికేయ సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. అయితే ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను డిజైన్‌ చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్‌ మమ్మల్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. రిలయన్స్‌ జియో అందించిన ఓ మాడ్యులేటర్‌ ద్వారా మిలటరీ గ్రేడ్‌ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్‌ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను మేం అడ్డుకున్నాం. ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెల్చుకుంది. లేకుంటే బీజేపీ స్వీప్‌ చేసి ఉండేది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సంకేత ప్రసారాలను మాబృందం అడ్డుకుంది. లేకుంటే ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించి ఉండేది. 

గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్‌ జరిగింది. 2014 ఏప్రిల్‌లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించాం. మాకు తెలిసిన ఈ సమాచారంతో బీజేపీని బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకున్నాం. హైదరాబాద్‌ శివార్లలో బీజేపీ నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు. తన బృందంలోని కొందరు సభ్యులు హత్యకు గురికావడంతో 2014లో తాను భారత్‌ నుంచి పరారయ్యాయని చెప్పారు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరారన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ అంగీకరించారు.  ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారుచేశారన్నది తెలుసుకునేందుకు సమాచారం చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగింది అన్నారు. నా ఆరోపణలకు ఆధారాలిస్తా. ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే మీకు హ్యాకింగ్‌ తీరును వివరిస్తా. ఏయే ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందో చెబుతా అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆహ్వానించాం. కానీ రాలేదు. రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. అయితే కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబల్‌ ఒక్కరే వచ్చారు అన్నారు.

హ్యాకర్‌ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్‌ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అంటుంది. హ్యాకర్‌ షుజా ముఖానికి ఉన్న ముసుగు తీసి ఆధారాలు బయటపెడితేనే కానీ అసలు నిజాలు ఏంటో మనకి తెలియవు.