రోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్పలు.. బ్లాక్‌మనీ సంచులేనా?
Published on: Thu Dec 30, 2021 10:18AM
అది మామూలు గ్రామం. కాకపోతే జాతీయ రహదారిపై ఉంటుంది. ఆ ఊరికి ఎలాంటి ప్రత్యేకతలు లేవు. కానీ, ఉదయం తెల్లవారగానే ఆ గ్రామం పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమోగిపోతోంది. అందుకు కారణం.. రోడ్డుపై పడున్న కరెన్సీ నోట్ల సంచి.
అవును, కరెన్సీ నోట్ల సంచినే. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ వాహనం నుంచి కిందపడింది. సంచి రోడ్డుపై పడటంతో.. దానిపైనుంచి వాహనాలు వెళ్లడంతో.. సంచి చినిగి అందులోని కరెన్సీ నోట్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇంకేం. ఈ విషయం నిమిషాల్లో అందరికీ తెలిసిపోయింది. రోడ్లపై డబ్బులు పడ్డాయట అనుకుంటూ గ్రామస్తులు పరిగెత్తుకు వచ్చారు. అక్కడి సీన్ చూసి షాక్ అయ్యారు. ఉసూరుమన్నారు. కారణం....
అవన్నీ కరెన్సీ నోట్లో కానీ.. చినిగి ముక్కలుముక్కలుగా మారిన కరెన్సీ నోట్లు. అన్నీ చిన్నచిన్న ముక్కలుగా ఉన్నాయి. తుక్కుతుక్కుగా మారాయి. అసలేమాత్రం పనికి రావవి. మరి, కరెన్సీ నోట్లను అలా చించేసి సంచుల్లో తరలిస్తున్నది ఎవరు? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకీ అవి నిజమైన నోట్లేనా? నకిలీవా? వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అనుమానాలు.
విషయం తెలిసి పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆ చినిగిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆర్‌బీఐ పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదు. కాబట్టి అది నల్లధనమో లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉంది. ఏ వాహనం నుంచి అవి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నాం’ అని పోలీస్ అధికారు అన్నారు. ఈ ఘటన.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ దగ్గర హైదరాబాద్-నాగ్‌పుర్ జాతీయ రహదారిపై జరిగింది.


