TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాయిప్రతాప్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెసు తంటాలు

Published on: Mon Apr 23, 2012 1:57PM

కడపజిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీపై ఉన్న కోపంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఇన్ ఛార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కూడా ఆయన అడ్రస్సు తెలియటం లేదు. లోక్ సభ నియోజకవర్గ పరిథిలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సాయిప్రతాప్ ఇటువంటి వైఖరి ప్రదర్శించటం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి బొత్సా సత్యనారాయణకు కూడా చెమటలు పట్టిస్తున్నాయి. దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన సాయిప్రతాప్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేస్తూ కాంగ్రెసు పార్టీలో ఎవరు వై.ఎస్. రాజశేఖరరెడ్డిని విమర్శించినా తాను సహించబోనన్నారు.

 

 

ఆ తరువాత ఆయన కాంగ్రెసు పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు కూడా బలంగా వినిపించాయి. సాయిప్రతాప్ అంతరంగం ఆయన సన్నిహితులకు కూడా అంతుపట్టడం లేదు. కానీ ఆయన ఇటీవల పలు విషయాల్లో పార్టీ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోడూరు అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే గంటి ప్రసాద్ ను నిలబెట్టాలని సాయిప్రతాప్ సూచించారు. అయితే అధిస్థానం కనపర్తి ఈశ్వరయ్యకు టిక్కెట్టు ఇచ్చే యోచనతో ఉండటంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు సాయికృష్ణా రెడ్డి వైఖరి కూడా సాయిప్రతాప్ కు నచ్చటం లేదని తెలిసింది. తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ వ్యవహారాల్లో సాయికృష్ణారెడ్డి జోక్యం పెరిగిపోయిందని, తనను ఏమాత్రం సంప్రదించకుండా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని సాయిప్రతాప్ అంటున్నారు. ఏది ఏమైనా సాయిప్రతాప్ వైఖరితో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కంగారుపడుతున్నారు. ఆయనను ప్రసన్నం చేసుకోకపోతే వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.