తెలంగాణలో కరోనా తీవ్రతపై సీఎస్ కు గవర్నర్ ఆదేశాలు

తెలంగాణలో రోజురోజుకు కరోనా తీవ్రమవుతోంది. ప్రతి రోజు వందలుగా నమోదయ్యే పాజిటివ్ కేసులు ఇపుడు ఏకంగా 1500 నుండి 2000 కు మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా ఇదే విషయం పై చర్చించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ని ఈ రోజు రాజభవన్ కు పిలిపించారు. ఈ సంగతిని ఆమె ఒక ట్వీట్ ద్వారా తెలిపారు

ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో జరుగుతున్న కరోనా పరీక్షల విషయంలో గవర్నర్ తమిళిసై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇపుడు తాజాగా ప్రతి రోజు తెలంగాణ లో నమోదవుతున్న కేసుల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపధ్యం లో గవర్నర్ ఈ ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కరోనా చికిత్సలు జరుగుతున్న గాంధీ , కోఠి ఇ ఎన్ టి , ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్స్ లో ఉన్న సదుపాయాలు పిపియి కిట్ల, ఎన్ 95 మాస్కుల లభ్యత పై వివరణ అడిగే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, సాయంత్రం 4 గంటలకు మీటింగ్ కి రావాలని సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిలను గవర్నర్ కోరగా.. అధికారులు కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదని తెలుస్తోంది. మీటింగ్ రేపు జరిగే అవకాశముందని సమాచారం.

మరో పక్క రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24000 కు చేరువ కావడం తో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ను దాటుకుని ముందుకు వెళుతున్న పరిస్థితి నెలకొంది.