కశ్మీర్‌లో ఉగ్రదాడి: నలుగురు జవాన్లు మృతి

భారత సైన్యంపై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. సైనిక శిక్షణా శిబిరంపై దాడి చేసి నలుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో  లెతెపోరాకు సమీపంలోని 185వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై.. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. వెంటనే స్పందించిన సీఆర్‌పీఎఫ్ బలగాలు ధీటుగా ఎదురుకాల్పులకు దిగాయి. దాదాపు పదకొండు గంటలపాటు భీకర కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. క్షతగాత్రులైన జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది ఆగస్టులో పుల్వామా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.