ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టి పాతిక లక్షలు కొట్టేసింది

కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు, కానీ మోసాలకు కోటి ఉపాయాలు అంటున్నారు చీటర్లు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ కొత్తకొత్త ఐడియాలతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ, క్యాష్‌ కొల్లగొడుతున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. జల్సాలకు అలవాటుపడ్డ ఓ యువతి.... ఈ సూత్రాన్నే నమ్ముకుని జనం నుంచి లక్షలు కొట్టేసింది.

 

హైదరాబాద్‌కి చెందిన యువతి సమియ తండ్రి అబ్దుల్ హఫీజ్‌ గొంతు కేన్సర్‌తో బాధపడుతూ.... ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తండ్రికున్న కేన్సర్‌‌‌ను సమియ క్యాష్ చేసుకోవాలనుకుంది. తండ్రికున్న కేన్సర్‌ను తనకున్నట్లు అన్వయించుకుంది. ఫండ్స్‌ కలెక్ట్ చేసేందుకు....తండ్రి పేరుకు బదులు తన పేరుతో సర్టిఫికెట్లను మార్చేసింది. తర్వాత గో ఫండ్ సమియా పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసింది. బ్రెయిన్, బ్రీస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు ఫేస్‌ బుక్‌లో సర్టిఫికెట్లతో పాటు స్కానిగ్‌ రిపోర్టులు పెట్టింది. ఫండ్స్‌ పంపించే వారి కోసం గన్‌ ఫౌండ్రీలో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. తర్వాత క్యాన్సర్‌ సర్టిఫికెట్లతో పాటు తన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు....కేన్సర్‌కు చికిత్స పొందుతున్నట్లు వీడియోలను పెట్టింది. ఇదంతా నిజమేనేమోనని...ఫేస్‌బుక్‌ యూజర్లు చలించిపోయారు. ఉన్నత చదువులు చదివిన తనను బతికించాలని వేడుకుంది. అందమైన యువతి...అందులో బంగారు భవిష్యత్ ఉండటంతో అనేక మంది దాతలు ముందుకొచ్చారు. ఇండియాతో పాటు ఇతర దేశాల నుంచి గో ఫండ్‌ సమ్యా అకౌంట్లో 22 లక్షల రూపాయలు వేశారు.

 

మనీ వసూలు చేసే విషయంలో సమియా జాగ్రతలు తీసుకుంది. ఎలాంటి ఫోన్ వాడకుండా... కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే దాతలతో టచ్‌లోకి వచ్చింది. సమియా ఆరోగ్యం ఎలా ఉందోనంటూ....తెలుసుకునేందుకు పలువురు దాతలు ఆస్పత్రికి వెళ్లారు. సమియా కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ గురించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. సమియా పేరుతో ఉన్న వారికి తాము ట్రీట్‌మెంట్‌ చేయలేదని చెప్పడంతో....దాతలు అవాక్కయ్యారు. అదే సమయంలో ఆస్పతక్రి యాజమాన్యం....మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సమియా చేతిలో మోసపోయిన దాతలు....గో ఫండ్‌ సమ్యాకు నిధులు ఇవ్వొద్దంటూ ఏకంగా ఓ బ్లాగ్‌నే క్రియేట్‌ చేయాల్సి వచ్చింది. అయితే దాతలు ఇచ్చిన డబ్బుతో సమియా హరా, రియాద్‌లో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.