TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐతానగర్ రౌడీ బ్యాచ్ కు జగన్ పరామర్శ.. సంకేతమేంటి?

Published on: Mon Jun 2, 2025 3:23PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రకటించిన షెడ్యూల్ మేరకు జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (జూన్ 3) తెనాలిలో పర్యటించనున్నారు.   అయితే ఈ పర్యటన ఎందుకు అంటే..  ఇటీవల పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులపై  జులుం చెలాయించిన ఘటనలో బాధితులను పరామర్శించడానికట. ఔను పోలీసులు ఇటీవల తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులకు బహిరంగంగా లాఠీ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడంటూ వైసీపీ నానా హంగామా చేస్తున్నది. ఆ గాయపడిన యువకుడు జాన్ విక్టర్ ను పరామర్శించమే జగన్ తెనాలి పర్యటన ముఖ్య ఉద్దేశమట. ఇందు కోసం ఆయన సోమవారం సాయంత్రానికే బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు. 

సరే ఇంతకీ పోలీసులు ఓపెన్ లాఠీ ట్రీట్ మెంట్ కు గురైన ముగ్గురు యువకులూ ఎవరంటే..  పలు కేసులలో నిందితులు. అన్నిటికీ మించి ఒక కానిస్టేబుల్ పై దాడి చేసి, బెదరించిన వారు. వారికి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ పట్ల ఐతానగర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. వారి ఆగడాలు భరించలేక పోతున్నామనీ, ఇప్పుడు పోలీసుల ట్రీట్ మెంట్ తోనైనా వారిలో భయం పుట్టి అరాచకాలకు స్వస్తి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలా ప్రజల దృష్టిలో దుర్మార్గులుగానూ, చట్టం దృష్టిలో నేరస్తులుగానూ ముద్రపడిన వ్యక్తులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ కు నిరసనగా, ఆ ట్రీట్ మెంట్ లో తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్న జాన్ విక్టర్ ను పరామర్శించడానికి జగన్ బయలుదేరారు. అయితే పోలీస్ ట్రీట్మెంట్ జరిగి వారం దాటిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా జగన్ వారిని పరామర్శించడానికి రావడానికి కారణమేంటి? అంటే... దళితులపై పోలీసుల దౌర్జన్యం అంటూ కలర్ ఇచ్చి రాజకీయ లబ్ధి పొందానికే. 

జగన్ తెనాలి పర్యటన ప్రకటన వచ్చీ రావడంతోనే అన్నివర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ  అధినేత.. రౌడీ షీటర్లను పరామర్శించడం ఎలాంటి సంకేతాలను ఇస్తుందన్న చర్చా మొదలైంది. వైసీపీలోనే పలువురు జగన్ పరామర్శ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.  క్రిమినల్స్ ను పరామర్శించడమంటే.. అలా పరామర్శిస్తున్న వారిది  కచ్చితంగా క్రిమినల్ మనస్తత్వమే అయి ఉంటుందని చెబుతున్నారు. 

వాస్తవానికి ఇప్పుడు జగన్ పరామర్శించనున్న వారు సజ్జనులు కాదు. కరుడుగట్టిన నేరస్తులు. గంజాయి బ్యాచ్ కు చెందిన వారు. గంజాయి స్మగ్లింగ్, అమాయకులపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన వారు. అది కూడదంటూ హెచ్చరించిన పోలీసుపైనే దాడికి పాల్పడిన వారు. అటువంటి వారిని పరామర్శించడానికి జగన్ తగుదునమ్మా అంటూ బయలు దేరడాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తప్పుపట్టారు. వారిని పరామర్శించడం ద్వారా జగన్ పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు.