యూపీ ఎన్నికల బరిలో నేర చరితులు
Published on: Fri Feb 4, 2022 10:39AM
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీల సిద్ధాంతాలు వేరు కావచ్చును. జెండాలు, అజెండాలు వేరుకావచ్చును, కానీ, నేర చరితులకు, ఆర్థిక నేరస్తులకు టిక్కట్లు ఇచ్చి ప్రోత్సహించడంలో మాత్రం అన్ని పార్టీలదీ ఒకటే మాట ..నేరాలు ఎన్నున్నా, గెలిచే అవకాశం ఉందంటే పిలిచి మరీ టికెట్లు ఇచ్చాయి.
ఏడు విడతల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 10 న 58 నియోజక వర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఈ 58 నియోజక నియోజక వర్గాల్లో మొత్తం 615 పోటీలో ఉన్నారు, ఇందులో దాదాపు 25 శాతం మంది నేర చరితులే ఉన్నారని, అసోషియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. అంటే 156 మంది అభ్యర్థులు పలు కేసుల్లో నిందితులు. ఇందులో 121 మందిపై అత్యాచారం, కిడ్నాపులు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. పోటీలో ఉన్న 623 మంది అభ్యర్థుల్లో 615 మంది ప్రమాణపత్రాలను ఈ సంస్థ నిశితంగా విశ్లేషించింది. మిగిలిన 8 మందివి సరిగా స్కాన్ కాకపోవడంవల్ల వాటిని పరిశీలించలేకపోయినట్లు పేర్కొంది.
ఒకరిని మించి ఒకరు..ఈ నివేదిక ప్రకారం.. నేరస్థులకు టికెట్లిచ్చిన ప్రముఖ పార్టీల్లో ఎస్పీ, భాజపా, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి ఇందులో 12 మందికి మహిళలపై నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. ఒక అభ్యర్థిపై అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదైంది. ఆరుగురు అభ్యర్థులపై హత్య, 30 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. తొలిదశ ఎన్నికలు జరిగే 58 నియోజకవర్గాల్లో 31 (53శాతం) నియోజకవర్గాలు రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. వాటిలో ముగ్గురు అంతకుమించిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
"యూపీలో పోటీ చేస్తున్న అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు 15 నుంచి 75 శాతం మంది నేరస్థులకు టికెట్లిచ్చాయి. తమపై నేరాభియోగాలు ఉన్నట్లు వారే తమ ప్రమాణపత్రాల్లో అంగీకరించారు. దీన్ని బట్టి ఎన్నికల సంస్కరణలపై మన రాజకీయ పార్టీలకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టమవుతోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారే చట్టాన్ని తయారుచేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు"- అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.


