విఫలమవుతున్న సి.పి.ఎం. వ్యూహాలు!
Published on: Wed Apr 25, 2012 1:01PM
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఎన్నికల్లో పొత్తులు లాభసాటిగా లేవని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ప్రకటించడాన్ని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు అంటూ దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒకదానితో పొత్తుకుడుర్చుకుంటూ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చి, నేడు ఆకస్మికంగా లాభసాటి కాదని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
1994 ఎన్నికల్లో 16 స్థానాల్లో సిపిఎం పార్టీ విజయం సాధించింది. ఆనాడు తెలుగుదేశం పార్టీతో తమ ఎన్నికల పొత్తు వ్యూహం ఫలించినట్లు సిపిఎం నేతలు ప్రకటించారు. ఆ తరువాత విద్యుత్ ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. ఆ పొత్తును కూడా సమర్థించుకొంది. గత ఎన్నికల్లో (2009) తెలుగుదేశం, టి.ఆర్.ఎస్.లతో పొత్తు కుదుర్చుకుంది. ఆ పొత్తును కూడా సమర్థించుకున్నప్పటికీ వాస్తవంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడంతో బి.వి. రాఘవులు ఆశ్చర్యానికి గురయ్యారు.
పొత్తులో ఎక్కువస్థానాలు పొందితే ఎత్తుగడ విజయం సాధించినట్టు ... ఓడిపోతే పొత్తు ఎత్తుగడ విఫలమైనట్టు భావించడం ఎటువంటి రాజకీయమో పరిశీలకులు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఉప ఎన్నికల్లో సిపిఎం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, స్వాతంత్రంగానే అయిదు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ప్రకటించారు. ఉప ఎన్నికలు జరిగే మొత్తం స్థానాలు 18, వీటిలో అయిదు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తే మిగిలిన స్థానాల అంగటి ఏమిటని? ఈ స్థానాల్లోని సిపిఎం అభిమానులు ఓటు చేయడం బహిష్కరించాలా? లేకపోతే తమకు యిష్టమైన పార్టీకి ఓటు చేసుకోవచ్చునా? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.


