వామపక్షాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్: కరవు పరిస్థితులపై చర్చ.. జగన్ హాజరయ్యేనా?
Published on: Fri Sep 25, 2026 2:30PM

రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని కలుపుకునిపోయే క్రమంలో సీపీఐ వర్గాలు కీలక అడుగు వేశాయి. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను సీపీఐ నేతలు రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆహ్వానం పంపారు. గత దశాన్నర కాలంగా ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా, సొంత బలాన్ని నమ్ముకుంటూ పూర్తిగా స్వతంత్రంగా రాజకీయాలు నడుపుతూ వస్తున్న జగన్ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరౌతారా లేదా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీపీఐ సీనియర్ నాయకులు వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, శనివారం (సెప్టెంబర్ 26) విజయవాడలో జరగనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీటి సమస్య వంటి సమస్యలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించేందుకు, . ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్నిఏర్పాటు చేసినట్లు జగన్ కు వారు వివరించారు.
.webp)
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ రాష్ట్రంలో రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే వైఎస్ జగన్ ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణలో భాగస్వామ్యమయ్యే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవవుతున్నాయి. తన 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇంత వరకూ జగన్ ఎవరితోనూ రాజకీయ ఒప్పందాలు లేదా ఉమ్మడి వేదికలను పంచుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో వామపక్షాల నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు అందిన ఆహ్వానాన్ని ఆయన మన్నిస్తారా అన్న అనుమానాలు సహజంగానే పరిశీలకుల్లోనూ, వైపీపీ వర్గాల్లోనూ కూడా వ్యక్తమౌతున్నాయి.
[CPI Round Table Conference, YS Jagan Mohan Reddy, Invitation , YCP, Andhra Pradesh Drought, Vijayawada, Telugu One]


