రీటెండరింగ్ ఎందుకు దండగ.. నవయుగ ఉండగా!!

 

పోలవరం ప్రాజెక్ట్ పనుల నుండి తప్పుకోవాలని నవయుగ సంస్థకు అర్ధాంతరంగా జగన్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పై రివర్స్ టెండరింగ్ కు వెళ్లేందుకు మార్గం సులువైంది. ఐతే ఇప్పుడు పోలవరం పై రీటెండరింగ్ వద్దని నవయుగ తొనే మిగిలిన ప్రాజెక్ట్ పనులు పూర్తీ చేయాలనీ కోరుతున్నారు ఎపి ముఖ్య నేత ఒకరు. ఐతే అయన ఏ టీడీపీ నాయకుడో అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. తాజాగా రీటెండరింగ్ వద్దని నవయుగ కంపెనీతోనే పనులు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సిపిఐ నేత రామకృష్ణ. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కె.రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని ఆ లేఖలో కోరారు. నవయుగ కంపెనీ నిబంధనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకుందని, అలాగే ఒరిజినల్ ధర కన్నా 14 శాతం తక్కువకే నవయుగ పనులు చేసిందని ఆయన తెలిపారు. అంతేకాదు కాంక్రీట్ పనులు చేయడంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విషయాన్ని కూడా రామకృష్ణ గుర్తు చేశారు. అంతే కాకుండా రీటెండరింగ్ వల్ల నిర్మాణ వ్యయం, పనుల్లో జాప్యం పెరుగుతోందే తప్ప లాభం ఏమీ ఉండదన్నారు. ఇకపోతే కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ప్రాజెక్ట్‌ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.