TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పోస్కోకు విజయసాయిరెడ్డి మద్దతు! 

Published on: Fri Feb 12, 2021 9:55AM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మికులకు మద్దతుగా పార్టీలకు అతీతంగా నేతలు కదిలివస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ జాతీయ నేత నారాయణ. పోస్కోకు వ్యతిరేకంగా ఒరిస్సా నుండి తరిమికొట్టే వరకు పోరాటం చేశామని చెప్పారు. ఇప్పుడు విశాఖ రాకుండా పోస్కోను తన్ని తరిమేస్తే సముద్రంలోకి పోవాల్సిందేనని చెప్పారు. భార్యాభర్తలు కలవకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అలాగే పరిశ్రమకి.. ఐరన్ ఓర్ లేకపోతే ప్రయోజనం లేదన్నారు నారాయణ. నష్టాల్లో ఉన్న పరిశ్రమని ప్రైవేటు వాళ్ళు ఎందుకు కొంటారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది కాబట్టే కొంటున్నారన్నారు నారాయణ. 

పోస్కోకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి లాంటి వారి మద్దతు ఉందని నారాయణ ఆరోపించారు. ఒకవేళ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటు అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. విశాఖలో పుట్టి పెరిగిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లారని, ఇప్పుడు ఉక్కు ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై వెంకయ్య నాయుడు  మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.  విశాఖ ఉక్కు కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమాన్ని సాగించాలని పిలుపు ఇచ్చారు నారాయణ.