TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం జగన్ కు సీపీఐ నారాయణ చురకలు

Published on: Tue Jun 11, 2019 2:11PM

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఒకవైపు మెచ్చుకుంటూనే, మరోవైపు చురకలు అంటించారు సీపీఐ నారాయణ. తాజాగా ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్ చాలా తక్కువ సమయంలో ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఎక్కువ మంచి పనులు చేస్తున్నారని, ఇది సంతోషకరమైన విషయమని ప్రశంసించారు. అలాగే హోదా కోసం కూడా పోరాడితే బాగుంటుందని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంతో పోరాడి హోదా తెస్తామని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో గెలిచిన ఎంపీ సీట్ల సంఖ్య ప్రధానం కాదని చెప్పారు. హోదా తీసుకురావాలన్న సిద్ధాంతం ముఖ్యమని వ్యాఖ్యానించారు. జగన్ హోదాపై కేంద్రాన్ని అడుక్కోవడం సరికాదని, పోరాడి సాధించాలని సూచించారు. జగన్ ప్రస్తుతం ఎక్కడా హోదా కోసం పోరాటం దిశగా సాగడం లేదని విమర్శించారు. హోదా పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొంది దాన్ని ఇప్పుడు సాధించకుండా వదిలేయడం మంచిది కాదని హితవు పలికారు.