బీజేపీకి బానిస.. విలాసవంతమైన యాచకురాలు! కంగనాపై నారాయణ హాట్ కామెంట్లు..
Published on: Fri Nov 12, 2021 9:32AM
దేశ రాజకీయాల్లో బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారిపోయారు. రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించి ట్వీట్లు చేస్తూ ఆమె కాక రాజేస్తున్నారు. ఎలాంటి విషయంలోనైనా తను స్పందించిందంటే ఏకిపారేస్తుంటుంది. ఇదే సమయంలో తీవ్ర విమర్శలకు గురౌతుంటుంది.బీజేపీకి అనుకూలంగా ఆమె చేసే కామెంట్లపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వివాదాస్పద నటీగా పేరున్న కంగనా కొన్ని రోజుల క్రితమే పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఇది ఇప్పుడు దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. కంగనాకు పద్మశ్రీ ఇవ్వడంపై కొన్ని వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ కంగనాపై హాట్ కామెంట్స్ చేశారు.
దేశ స్వతంత్ర ఉద్యమం గురించి కంగనా కామెంట్స్ చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని అన్నారు. కంగనా చేసిన ఆ వ్యాఖ్యలపై నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు అని మండిపడ్డారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని చెప్పారు. దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత కంగనాకు లేదని, ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు కూడా దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత లేదన్నారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం కంగనా బానిస మనస్తత్వానికి నిదర్శనమని నారాయణ అన్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తక్షణమే దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.


