అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది

 

రాష్ట్రంలో రెండు లెఫ్ట్ పార్టీలు ప్రజా సమస్యల తరపున ఎన్ని పోరాటాలు చేసినా అవి నేటి వరకు ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థాయికి మాత్రం ఎదగలేకపోయాయి. అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక ప్రధాన పార్టీకి అవి తోకపార్టీలుగానే కాలక్షేపం చేస్తున్నాయి. రెండు వేర్వేరు పార్టీలయినా ఇంతకాలంగా రైట్ టర్న్ తీసుకోకుండా రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ నుండే కలిసి ముందుకు పోతుండటంతో ప్రజలకి కూడా వాటి మధ్య పెద్దగా తేడా కనబడలేదు. పైగా రాఘవులు, నారాయణ ఇద్దరూ కూడా చిలకా గోరింకల్లా ఎప్పుడు కువకువలాడుతూ రాసుకు పూసుకు తిరుగుతుండటంతో ఇంతకాలం వారి కాపురం ఎర్రెర్రగా బాగానే సాగిపోయింది.

 

కానీ రాష్ట్ర విభజన విషయంలో సీపీయం సమైక్యానికి, సీపీఐ విభజనకి మొగ్గు చూపడంతో ఆ రెండు పార్టీల మధ్య ఎడమొహం పెడమొహం తప్పలేదు. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇటీవల డిల్లీ వెళ్ళినప్పుడు సీపీయం నేతలకి లాల్ సలాం చెప్పి రావడంతో, ఆరెండు పార్టీల మధ్య పొత్తులు పొడవనున్నాయని మీడియాలో ఒకటే లొల్లి మొదలయింది. జగన్ మోహన్ రెడ్డి సీపీయం నేతలకి ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చాడనే పుకార్లు కూడా మీడియాలో కనబడ్డాయి.

 

అసలే కొంచెం నోటి దురద ఉన్న నారాయణ, నలుగురితో నారాయణ అనుకొంటూ వైకాపా సీపీయంల మధ్య పొత్తులు కుదురుతున్నాయని చిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఎప్పుడు చిరునవ్వులు చిందించే రాఘవులు కూడా భగ్గుమన్నారు. అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు, మిగిలిన పార్టీలు ఎన్నయినా అననీ, కానీ లెఫ్టో రైటో తెలియకుండా అగమ్యంగా ముందుకు సాగుతూ, చికెన్ కర్రీలో ఇడ్లీముంచుకొని తినే నారాయణ కూడా తమను విమర్శించడమా? అని చాలా బాధపడిపోయిన రాఘవులు, “దమ్ముంటే నీ ఆరోపణలు ఋజువు చేయి...నారాయణ! అంటూ సవాలు విసిరారు. “మేము ‘కలిసుందాము రా’ అంటే నీకు నామోషీగా ఉన్నపుడు, మేమేవరితో కలిసి తిరిగితే నీకెందుకు దురద?” అని కోపగించుకొన్నారు కూడా.

 

మొత్తం మీద రాష్ట్ర విభజనతో లెఫ్ట్ పార్టీల్లో కూడా ముసలం పుట్టినట్లే ఉంది. అయితే రెండు పార్టీలు మళ్ళీ ఏదయినా మెయిన్ పార్టీకి అటాచ్ కాగానే ఇదంతా మరిచిపోయి మళ్ళీ ఒకరికొకరు లాల్ సలాములు చెప్పుకొని తమ పోరాటాలు కొనసాగించవచ్చును.