TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిపిఐ తో కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ

Published on: Tue Apr 10, 2012 10:34AM

హైదరాబాద్: తెలంగాణ ఎజెండాను పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ శానససభా స్థానంలో ఇటీవలి ఉప ఎన్నికల్లో బిజెపి షాక్ ఇచ్చింది. ఇప్పుడు సిపిఐ రూపంలో మరో ఎదురు దెబ్బ తగలబోతోంది. పరకాల ఉప ఎన్నికలో పోటీ చేయాలని సిపిఐ నిర్ణయం తీసుకుంది. ఇది కెసిఆర్‌కు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సిపిఐ ఇటీవలి ఉప ఎన్నికలకు దూరంగా ఉంది. ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ సిపిఐ కార్యదర్శి కె. నారాయణ వద్దకు వెళ్లి వేడుకున్నారు. దీంతో సిపిఐ మద్దకు కూడగట్టుకోగలిగారు. అయితే, వచ్చే ఉప ఎన్నికల్లో మాత్రం సిపిఐ తనకు లభించిన అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు.

త్వరలో రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో వరంగల్ జిల్లాకు చెందిన పరకాల ఒక్కటి మాత్రమే తెలంగాణలో ఉంది. ఈ స్థానంలో పోటీ చేయాలని ఇప్పటికే బిజెపి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిపిఐ సిద్ధపడింది. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన డిఎస్పీ నళిని కూడా ఇక్కడ పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.