కడపలో కరోనా కలకలం.. 50 మంది మెడికల్ స్టూడెంట్స్‌కు కొవిడ్..
Published on: Mon Jan 17, 2022 2:00PM
ఏపీలో కరోనా విరుచుకుపడుతోంది. రోజుకు దాదాపు 5వేల కేసులతో కుమ్మేస్తోంది. ఇంత జరుగుతున్నా.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు పెంచేందుకు సర్కారు ససేమిరా అంటోంది. తాజాగా, జగనన్న ఇలాఖాలో కొవిడ్ కలవర పెడుతోంది. ఏకంగా 50 మంది వైద్య విద్యార్థులు వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది.
కడప రిమ్స్ వైద్య కళాశాలలో కరోనా చెలరేగిపోతోంది. 50 మంది మెడికల్ స్టూడెంట్స్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. జాగ్రత్తగా ఉండే వైద్య విద్యార్థులకే కరోనా సోకడం.. అది కూడా అంతమందికి పాజిటివ్ రావడం కలవరపెడుతోంది.
అయితే, మంగళవారం ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కొవిడ్ బారినపడ్డారు. మరికొంత మంది విద్యార్థుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్సిటీని కోరింది. ఫైనల్ పరీక్షల ముందర.. కొవిడ్ కలకలం చెలరేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు పరీక్షల టెన్షన్.. మరోవైపు కొవిడ్ పరేషాన్‌తో.. సతమతమవుతున్నారు.


