రుయాలో ఏం జరిగింది? చనిపోయింది ఎంతమంది?
Published on: Tue May 11, 2021 11:17AM
తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రుయాలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి. రుయాకు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చనిపోయింది 11 మందని జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. మొత్తం 29 మంది అని మరణించారని తెలుస్తోంది. మృతి చెందిన 11 మంది బెడ్స్తో పాటు తమతో వైద్యం తీసుకుంటున్న మరో 18 మంది బెడ్స్ కూడా ఖాళీగా ఉండటంతో వారంతా మరణించి ఉంటారని రోగులు చెబుతున్నారు.
ఉత్తమ సేవలతో ప్రాణదాతగా పేరొందిన తిరుపతిలోని రుయాలో ఈ విషాదానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రభుత్వం చెబుతున్నది నిజమా? వాస్తవం ఏంటి? అన్న దానిపై సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. సోమవారం రాత్రి హాస్పిటల్ లో ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. రెండు అంతస్తులు.. 6వార్డులలో ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతున్నారు బాధితులు. రాత్రి 8 గంటలకు ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకార్ పూర్తిగా కాళీఅయ్యింది. కొవిడ్ వార్డుల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో పరిస్థితి ఒక్క సారిగా భయానకంగా మారింది. ఎటు చూసినా బెడ్లపై అచేతనంగా పడి ఉన్న బాధితులు, శ్వాసకోసం ఇబ్బందులు పడుతున్న వారే కనిపించారు. వైద్యులు, సిబ్బంది వారి చుట్టూ చేరి.. ఛాతీపై నొక్కుతూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న బాధిత బంధువులు.. వార్డులోకి పరుగులు తీశారు. అప్పటికే కొంతమంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వెంటిలేటర్ పై ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వారికీ... ఊపిరి అందించేందుకు బాధిత బంధువులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కన్నీరు పెట్టేలా చేశాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిందని, నామమాత్రంగా కొందరికి మాత్రమే ఆక్సిజన్ ను సరఫరా చేసారని కరోనా బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. 30 నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ అందక... బాధితుల బంధులువ అరుపులు కేకలతో రుయా ఎంఎంవార్డ్ దద్దరిలింది. తమ వారు కళ్ళముందే ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే ఎం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్లిపోయారు. మరి కొందరు గట్టిగ ఏడుస్తూ.. బంధువులకు సమాచారం అందించే ప్రయత్నం చేసారు. వారిని ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆసుపత్రిలోని వార్డులోనే నిలువరించారు. వార్డులోని డాక్టర్స్, సిబ్బంది పై అక్కడ ఉన్న సహాయకులు గొడవకు దిగడంతో సిబ్బంది వార్డులలో నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే 9 గంటల సమయానికి శ్రీపెరంబదూర్ నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. ఇంతలోపే జరగాల్సిన విపత్తు అంతా జరిగిపోయింది.
ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన జరిగిన ఆక్సిజన్ ప్లాంట్, ఎంఎం వార్డులను పరిశీలించారు. రుయాలో వెయ్యిమంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇందులో 700 ఆక్సిజన్, మరో 300 సాధారణ పడకలు ఉన్నాయన్నారు కలెక్టర్. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రాణవాయువు సరఫరా కొంత తగ్గడం వల్ల ఘటన జరిగిందని ఆయన నిర్ధారించారు. ఆక్సిజన్ సరఫరా లేటవ్వడంతో కొంతమంది కొవిడ్ చికిత్స పొందుతున్న వాళ్లు చనిపోయారని కలెక్టర్ వెల్లడించారు. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా కొంత తగ్గిందని.. ఈలోగా ట్యాంకర్ రావడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగినట్లయిందని అన్నారు. వెంటిలేటర్ల మీద ఉన్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. మృతుల బంధువులు మాత్రం హాస్పిటల్ యాజమాన్యం తప్పిదంతోనే ఈ ఘటన జరిదని ఆరోపిస్తున్నారు. వెయ్యి మందికి వైద్యం అందిస్తున్న ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పరిశులించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు మరణాల లెక్కలు తప్పు చెప్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు బాధితులు.


