TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరణపై భిన్న వాదనలు

Published on: Fri Apr 17, 2020 8:53AM

కరోనా మహమ్మారి నివారణకు టీకాను ఆవిష్కరించటానికి, ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 18 నెలల కలం పడుతుందని శాంతాబయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కె ఐ వరప్రసాద రెడ్డి లాంటి ఫార్మా రంగ ప్రముఖులు చెపుతుంటే, కరోనా వ్యాక్సిన్ ను మరో రెండు నెలల్లోనే కనుగొనే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వ్యాఖ్యానించటం గందరగోళానికి దరి తీస్తోంది.  గతంలో పోలియో, రేబిస్ టీకాలను తయారు చేసిన క్రియారహిత (ఇన్ యాక్టివేటెడ్) వైరస్ టీకాపై తాము దృష్టిని సారించామని ఆయన చెప్పుకొచ్చినప్పటికీ, ఈ అంశానికి సంబంధించి ఆర్ ఎండ్ డి ప్రొటొకాల్స్ ఎలా ఉంటాయో, ఇప్పటికే డాక్టర్ వరప్రసాద రెడ్డి వివరించారు. మొత్తం నలభై దేశాలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాయనీ, ఎంత లేదన్నా 18 నెలల నుంచి 24 నెలలు సమయం పడుతుందనీ ఆయన సోదాహరణంగా వివరించారు. ఆల్రెడీ డెవెలప్ అయిన ఫార్ములాను బేస్ చేసుకుని , భారతీయ వాతావరణం లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ కు బయటకు తీసుకురావటానికి ఐదున్నరేళ్ళు పట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొరోనా వైరస్ RNA కూడా ఏమిటో తెలియని పరిస్థితుల్లో , సి సి ఎం బి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మరి ఏ రకంగా , రెండు నెలల్లో కొరోనా వ్యాక్సిన్ ను కనుక్కోగలరనేది  ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

 

టీకా తయారీ విధానాన్ని గురించి వివరించిన సి సి ఎం బి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా , తొలుత సజీవ వైరస్ లను ల్యాబ్ లో అధికంగా పెంచుతామని, ఆపైన వాటిపై రసాయనాలు, వేడిని ప్రయోగించడం ద్వారా క్రియారహితం చేసి, ప్రజలకు టీకా రూపంలో వేయాల్సి వుంటుందని అన్నారు. వేడి చేయడం ద్వారా వ్యాధి కారకమైన ప్యాథోజెన్ చనిపోయి, వైరస్ పెరిగే సామర్థ్యం నిలిచిపోతుందని అన్నారు. వీటితో ప్రజలకు ముప్పు ఉండదని, పైగా ఇన్ యాక్టివేటెడ్ వైరస్ టీకా శరీరంలోకి వెళ్లగానే, అది వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు అందిస్తుందని అన్నారు.

 

ఆపై వైరస్ శరీరంపై దాడి చేయగానే, యాండీ బాడీలు భారీగా విడుదలై, వైరస్ పై యుద్ధానికి దిగుతాయని, అనారోగ్యంతో బాధపడేవారు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్నవారు, వృద్ధులకు క్రియా రహిత టీకా ఇవ్వడం సురక్షితమని తెలిపారు. ప్రయోగశాలలో వైరస్ ను పెంచిన తరువాత టీకాల తయారీకి పరిశ్రమలకు కూడా వైరస్ ను ఇస్తామని తెలిపారు. కాగా, వైరస్ ను వృద్ధి చేయడం ఇక్కడి వాతావరణానికి సవాలేనని, ఆఫ్రికన్ గ్రీన్ కోతి కణాలకు మానవ కణాలకు పోలికలు ఎక్కువగా ఉండటంతో వీటిపై సెల్ వైరస్ కల్చర్ చేస్తున్నామని కణాల్లో వైరస్ వృద్ధి చెందేలా చూస్తున్నామని రాకేశ్ మిశ్రా వెల్లడించారు. ఇవన్నీ ఆయన వివరించినప్పటికీ, ప్రాక్టికల్ గా హెల్త్ ప్రొటొకాల్స్ ఏ మేరకు సహకరిస్తాయి వేచి చూడాలి.