భారతీయులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం
Published on: Sat Jan 2, 2021 1:50PM
దేశమంతటా కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ డ్రై రన్ ను పరిశీలించడానికి ఓ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశమంతటా కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.
ఢిల్లీలో మాదిరిగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు మంత్రి మాట్లాడుతూ, ఢిల్లీలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉచితమేనని చెప్పారు. భారత్ లో తొలి విడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను అందజేస్తామని తెలిపారు. తొలి విడతలో కోటి మంది వైద్యారోగ్య సిబ్బందితో పాటు మరో రెండు కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత విడతలో మరో 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


