తెలంగాణలో చాలా నెమ్మదిగా సాగుతున్న క‌రోనా టెస్ట్‌లు!

క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల‌కు క‌నీసం 10 శాతం మందిని కూడా పరీక్షించలేదట‌. తెలంగాణలో 26,586 మంది విదేశీ ప్రయాణీకులు, వారి పరిచయాలు కలిగి క్వారంటైన్‌లో వున్నారు. వారిలో కేవ‌లం 2400 మంది ర‌క్త‌పు నమూనాలను సేక‌రించి పరీక్షలు చేశారు. మిగ‌తావారికి ఇంత వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. ఈ విష‌యం తెలంగాణా ఆరోగ్య‌శాఖ రాష్ట్ర‌ప‌తికి పంపిన నివేదిక ద్వారా బ‌య‌ట‌ప‌డిందని టి.కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

అవ‌స‌ర‌మైతే ప్రైవేట్ ల్యాబ్‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సూచించింది. ప్రైవేటు ప్రయోగశాలలు COVID-19 పరీక్షలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక మార్గదర్శకాలను రూపొందించాలని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

నమూనాల సేకరణ, ప్యాకేజింగ్, రవాణా కోసం ఐసిఎంఆర్ ఇప్పటికే మార్గదర్శకాలను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్-ఎస్ఓపిని కూడా రూపొందించింది. వారం క్రిందటే ఆమోదం లభించినా...ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మార్గదర్శకాలు రూపొందించలేదు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణలో చాలా నెమ్మదిగా సాగుతోంది, 10% మంది అనుమానితులను కూడా పరీక్షించలేదు.

కొరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఐసిఎంఆర్ హైదరాబాద్‌లోని 9 ప్రైవేట్ ప్రయోగశాలలను ఆమోదించింది. COVID-19 పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ప్రయోగశాలలను అనుమతించలేదు. ప్రతి ప్రైవేట్ డయాగ్నొస్టిక్ ప్రయోగశాల రోజుకు 50 నుండి 100 కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

అపోలో హాస్పిటల్స్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, విమ్టా ల్యాబ్స్, అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పాత్ కేర్ ల్యాబ్స్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ లాబొరేటరీ సైన్సెస్, మెడ్సిస్ పాత్లాబ్స్ ఇండియా, మెడిసిన్ విభాగం ప్రయోగశాల, యశోద హాస్పిటల్‌లు ఉన్నాయి.

దక్షిణ కొరియా మాదిరి..పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి కరోనావైరస్ వ్యాప్తిని సమర్థంగా నియంత్రించాలని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సూచించింది.