TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనంతబాబు బెయిలు రద్దు

Published on: Wed May 13, 2026 4:57PM

కాకినాడ జిల్లాలో పెను సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన అనంతబాబుకు న్యాయస్థానం   షాక్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్‌ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయంతో అనంతబాబుకు లభించిన తాత్కాలిక ఊరట ముగిసినట్లయింది.

ఈ కేసులో బెయిల్ పొందిన అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, బెయిల్ రద్దుకు ఆదేశాలు జారీ చేశారు.

 కాగా సాక్షులను భయపెట్టిన వ్యవహారంలో గత నెలలో సర్పవరం పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు హత్య కేసులో   బెయిల్  కూడా రద్దు కావడంతో ఈ కేసు  విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు  జైలులోనే ఉండాల్సి ఉంటుంది.   తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తన సొంత కారులోనే తీసుకువచ్చి.. కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేసి.. హత్యను  ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నది అనంతబాబుపై ఉన్న   అభియోగం. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను   దుమారం రేపింది.

అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం బెయిల్ రద్దు కావడం, ఈ నెల 20వ తేదీ నుంచి హత్య కేసుపై రెగ్యులర్ విచారణను చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేయడంతో ఈ కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తుందని భావిస్తున్నారు.