మటుమాయం కానున్నఅవినీతి, అధిక ధరలు

 

లోకులు కాకులవంటి వారు. అవినీతి మరకలు అంటని కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చవాకులు వాగుతుంటారు. కాంగ్రెస్ యువరాజావారు అవినీతిని అంతం చేయాలనే సంకల్పం చెప్పుకొని స్వయంగా చొరవ తీసుకొని రెండేళ్లుగా అటక మీద పడున్న లోక్ పాల్ బిల్లుని దుమ్ముదులిపి పార్లమెంటు చేత ఆమోదింపజేసినప్పటికీ ఒక్కరు కూడా పాపం! ఆయనను మెచ్చుకొన్న పాపాన పోలేదు. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేస్తే గానీ తమకీ జ్ఞానోదయం కలగలేదా? అంటూ యువరాజవారని కూడా చూడకుండా జనాలు ఆయనతో పరాచికాలు ఆడారు.

 

కానీ ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడి వంటి వ్యక్తి గనుక ఈరోజు తమ పన్నెండు రాజ్యాల ముఖ్యమంత్రులను డిల్లీకి పిలిపించుకొని వెంటనే తమ తమ రాజ్యాల నుండి అవినీతిని, అధిక ధరలను తరిమేయమని హుకూం జారీ చేసారు. అయినా అనకూడదు కానీ, కొత్త పార్టీ పెట్టుకొని బయటకిపోయే కిరణ్ కుమా రెడ్డిని పట్టుకొని యువరాజవారు అవినీతిని, అధిక ధరలను అంతం చేయామని ఆదేశిస్తే పాపం ఆయన మాత్రం ఈ వారం పదిరోజుల్లో ఏమి చేయగలరు? అందుకే ఆయన యువరాజా వారికి ఒక దివ్యమయిన సలహా ఇచ్చినట్లు సమాచారం. మనకి చేతకాని ఈ అవినీతి, అధిక ధరల అంతం గురించి ఎంత మాట్లాడినా వచ్చేఎన్నికలలో రాష్ట్రంలో జనాలు మనకి ఓటేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల వీటికంటే సమైక్యం గురించి మాట్లాడుకొంటే మనకి ఎక్కువ ‘లైక్స్’ వస్తాయని సూచించారు. కానీ యువరాజావారు ఆ సమైక్య టాపిక్ గురించి వేరేగా మాట్లాడుకొందామని, ఇప్పుడు మాత్రం అందరూ అవినీతి, అధిక ధరల గురించి అనర్గళంగా ఉపన్యసించండని ఆదేశించడంతో అందరూ దాని గురించే మాట్లాడేసి బయటపడ్డారుట. ఇంతకీ ఈ ప్రయాస అంతా అవినీతిని, అధిక ధరలను అంతం చేయడానికా లేక వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు మాత్రమేనా? అని ఎవరయినా ప్రశ్నిస్తే వారి అజ్ఞానికి నవ్వుకోక తప్పదు.

 

గమనిక: అదృష్టవశాత్తు ఆ పన్నెండు రాజ్యాలలో మన రాష్ట్రం కూడా ఒకటి గనుక ఒకవేళ రాత్రికి రాత్రే అధిక ధరలు, అవినీతి మాయమయిపోతే ఎవరూ ఆశ్చర్యపోవద్దని మనవి.