TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలినేని.. అవినీతి బాహుబలి!.. వందల కోట్లు దోపిడీ!!

Published on: Sat Apr 9, 2022 12:08PM

సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి బాహుబలి అంటూ టీడీపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆయన సకుటుంబ సపరివారంగా వందల కోట్లు దోచేశారని మండిప‌డింది. సీఎం జగన్ జే-ట్యాక్స్ తో దోచుకొంటుంటే, ఆయన దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను బీ-ట్యాక్స్‌తో దోపిడీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి విమ‌ర్శించారు. 

"తాను జగన్‌ బంధువునని చెప్పుకొంటూ మంత్రి బాలినేని ఈ మూడేళ్లలో దారుణంగా దోచుకొన్నారు. ఆయన అవినీతి సంపాదన రూ.1,700 కోట్లు దాటిపోయింది. మంత్రి బాలినేని కారులో హవాలా సొమ్ము రూ.5 కోట్లు దొరికింది. ఆ కారుపై బాలినేని స్టిక్కర్‌ ఉంది. అయినా ఆయనపై ముఖ్యమంత్రి ఏ చర్యా తీసుకోలేదు". అన్నారు. 

"ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు విపరీతంగా ఉన్నాయి. వాటిని కూడా మంత్రి వదిలిపెట్టలేదు. గ్రానైట్‌ వ్యాపారులపై బీ ట్యాక్స్‌ విధించి ప్రతి లారీకి ఇంతని వసూలు చేస్తున్నారు. గ్రానైట్‌ డంపింగ్‌ యార్డుల నుంచి వందల కోట్లు వసూలు చేశారు. పర్చూరు, చీరాల, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి ప్రాంతాల్లో ఇసుకను కూడా వదిలిపెట్టకుండా అక్రమ రవాణా చేయించి రూ.100 కోట్ల వరకూ కొల్లగొట్టారు. కొండపి నియోజకవర్గంలోని కొణిజేడు, ఎర్రజెర్ల ప్రాంతాల్లో రూ.40 కోట్ల విలువైన గ్రావెల్‌ను అమ్ముకొన్నారు. గనుల శాఖ పరిధిలో బాలినేని వసూళ్లు రూ.1,000 కోట్ల వరకూ ఉన్నాయి" అని ఎమ్మెల్యే డోలా ఆరోపించారు. 

భూ కబ్జాల్లో కూడా మంత్రి పేరుమోశారని, అందులో కూడా ఆయన సంపాదన వందల కోట్లలోనే ఉందని టీడీపీ ఎమ్మెల్యే డోలా విమర్శించారు. "ఒంగోలు నగరంలో రంగుల ఫ్యాక్టరీ వద్ద నాలుగు ఎకరాలు, మంగమూరు డొంకలో ఆరు ఎకరాలు, ఉడ్‌ కాంప్లెక్స్‌ వద్ద మూడు ఎకరాలతోపాటు డీకే పట్టాల రూపంలో ఉన్న భూమిని కూడా పెద్ద ఎత్తున ఆయన ఆక్రమించుకొన్నారు. కుటుంబ సభ్యులు కూడా పోటీపడి వసూళ్లు చేశారు. సకుటుంబంగా దోచుకొన్న మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. తన పదవి పోతుందని తెలిసి తనతోపాటు జిల్లాలో ఉన్న దళిత మంత్రిని కూడా తీయాలని పట్టుబట్టే నీచ స్థితికి ఆయన దిగజారాడు" అని డోలా విమర్శించారు.

"టీడీపీ హయాంలో ఒక యూనిట్‌ విద్యుత్‌ను బయట రూ.ఆరుకు కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ.22కు కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో భారీగా కమీషన్లు వసూలు చేసి సీఎం, విద్యుత్‌ మంత్రి బాలినేని పంచుకొంటున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో మంత్రి వాటాగా రూ.500 కోట్లు దక్కాయని విద్యుత్‌ వర్గాల్లో ప్రచారం అవుతోంది" అంటూ మంత్రి బాలినేనిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి.