TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొట్టుకున్న కార్పొరేట‌ర్లు!.. కౌన్సిల్‌లో ర‌చ్చ ర‌చ్చ‌..

Published on: Tue Apr 12, 2022 2:24PM

అస‌లే టీఆర్ఎస్‌, బీజేపీ కాక మీదున్నారు. వ‌రిపై ఓ రేంజ్‌లో వార్ న‌డుస్తోంది. కేసీఆర్ త‌గ్గేదేలే అంటున్నారు. క‌మ‌ల‌నాథులు వ‌దిలేదేలే అంటూ మ‌రింత క‌వ్విస్తున్నారు. పార్టీ లైన్‌కు త‌గ్గ‌ట్టే.. GHMC కౌన్సిల్ స‌మావేశంలోనూ గులాబీ, కాషాయ పార్టీ కార్పొరేట‌ర్లు ఢీ అంటే ఢీ అంటూ త‌ల‌ప‌డ్డాయి. మేయ‌ర్ స‌మ‌క్షంలోనే తిట్టుకున్నారు. తోసుకున్నారు. కొట్టుకున్నంత ప‌ని చేశారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ స‌మావేశమైంది. ఈ భేటీ వాడీవేడిగా జరిగింది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర‌ వాగ్వాదం జరిగింది. బీజేపీ వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదంటూ టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు రెచ్చ‌గొట్టారు. ఓ మ‌హిళా కార్పొరేట‌ర్ చేసిన‌ వ్యాఖ్యలపై క‌మ‌లం కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చించకుండా పక్కదారి పట్టస్తున్నారంటూ మేయ‌ర్‌ పోడియం ద‌గ్గ‌ర‌ నిరసన తెలిపారు. వారిని టీఆర్ఎస్ స‌భ్యులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో కౌన్సిల్‌లో ఉద్రిక్తత తలెత్తింది. 

బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన నేపథ్యంలో.. టీఆర్ఎస్ స‌భ్యురాలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని మేయర్ చెప్ప‌డంతో ప‌రిస్థితి కాస్త స‌ద్దుమ‌నిగింది.