కరోనా పీడకు త్వరలోనే వ్యాక్సిన్

కరోనా విలయతాండవంతో ప్రపంచం గజగజలాడుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. ఇదే సమయంలో కరోనా నివారణకు ఖచ్చితమైన మందు లేకపోవడంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ దాన్ని తయారుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కరోనా వైరస్ నివారణకు టీకా అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోని దాదాపు 12 ప్రముఖ సంస్థలు ప్రయత్నిస్తుండగా.. వాటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా మంచి ఫలితాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ తో చింపాజీలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇపుడు మనుషుల పైన ప్రయోగాలు కూడా వేగంగా చేస్తున్నట్టు ప్రముఖ శాస్త్రవేత్త ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. అంతేకాకుండా కరోనా వైరస్ నివారణకు సంబంధించిన టీకా అక్టోబరు వరకు సిద్ధం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆస్ట్రా జెనెకా అనే ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త వ్యాక్సిన్ ను బ్రెజిల్‌లో కొంతమందిపై ఇప్పటికే ప్రయోగించారు. దక్షిణాఫ్రికాలో కూడా ఈ టీకాను దాదాపు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. దీనికితోడు బ్రిటన్‌లో దాదాపు 4వేల మంది వాలంటీర్లు ఈ వ్యాక్సిన్ ప్రయోగానికి తమ అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరికి తోడు మరో 10వేల మందిని కూడా నియమించుకుంటామని యూనివర్సిటీ ప్రకటిచింది. ఏప్రిల్ 23న మొదలైన మానవ ప్రయోగాకు సంబంధించిన వివరాలు ఆగస్టు లేదా సెప్టెంబరులో వస్తాయని దీంతో అక్టోబరులో టీకాను విడుదల చేస్తామని అడ్రియన్ హిల్ తెలిపారు. ఆ దేవుడి దయవల్ల, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వ్యాక్సిన్ త్వరగా వస్తే ఊపిరి పేల్చుకోవచ్చని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.