వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించిన మోడీ నోట.. మహాకవి గురజాడ మాట.. 

భారత్ లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొద్ది సేపటి క్రితం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావును గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగంలో గురజాడ రాసిన దేశభక్తి గీతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గురజాడ గేయంలోని "సొంత లాభం కొంత మానుకొని.. పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌" అన్న వాక్యాలను అయన గుర్తు చేసారు. గురజాడ సిద్ధాంతాన్ని మనదేశం ఆచరించిందని.. దీంతో టీకా వచ్చిందని మోదీ అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని.. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వచ్చిందని జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దని అయన ప్రజలను హెచ్చరించారు. టీకా వేసుకున్నా భౌతికదూరం, మాస్క్‌ తప్పనిసరి అని మోడీ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ‌లోని గాంధీ ఆసుప‌త్రిలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, ఆరోగ్య‌మంత్రి ఈటెల స‌మ‌క్షంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మొద‌లుపెట్టారు. అందరికంటే ముందుగా ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి మొదటి వ్యాక్సిన్ ఇచ్చారు.