అర నిమిషంలోనే కోవిద్ 19 వైరస్ గుర్తింపు

ఢిల్లీలో ప్రారంభమైన ఇజ్రాయిల్ పరీక్షలు

కంటికి కనిపించని కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని మేధావులంతా కృషి చేస్తున్నారు. మన దేశంలో రోజుకూ అర లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఎక్కువ మందికి పరీక్షలు చేసేందుకు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మానవ మేధస్సుకు పదును పెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో వైరస్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్, ఇజ్రాయెల్ కలిసి వైరస్ ను గుర్తించే కొత్త సాంకేతిక పద్ధతులను పరీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను గుర్తించేందుకు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నాలుగు పద్ధతులను కొనుగొన్నారు. ప్రస్తుతం ఈ పద్ధతులను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రి (ఆర్ఎంఎల్)లో పరీక్షిస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇకపై 30 సెకన్లలోనే కరోనా ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే వైద్య చికిత్స అందించి వ్యాప్తిని నియంత్రించడం సులభం అవుతుంది. 

ఈ కొత్త పరీక్ష విధానంలో మన మాట, శ్వాసే శాంపిల్. ముక్కుతో గాలిని ఒక కవర్ బ్యాగ్ లోకి వదలాలి. ఆ గాలిని ఏఐ టెక్నాలజీ ఉండే ‘సెంట్ రీడర్ ’ అనే ఓ మెషీన్ లోకి పంపిస్తారు. అది టెర్రాహెర్ట్జ్ వేవ్స్ (టీహెచ్ జెడ్) అనే టెక్నాలజీ సాయంతో వైరస్ ను అర నిమిషంలోనే గుర్తిస్తుంది. ఆ తర్వాత వాయిస్ టెస్ట్, బ్రెతలైజర్ టెస్ట్, ఐసోథెర్మల్,  పాలి అమైనో యాసిడ్ టెస్ట్ చేస్తారు.