కరోనా కురుక్షేత్రంలో పోరాడుతున్న యోధుల‌కు స‌లాం!

ఎవరైనా దగ్గినా తుమ్మినా దూరంగా జరిగే రోజులివి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సైనికుల్లా ముందు వ‌రుస‌లో ధైర్యంగా నిలబడి, తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందించే మహనీయులు వైద్యులు, నర్సులు. క‌నిపించ‌ని శ‌త్రువు క‌రోనాతో చీకటితో యుద్ధం చేస్తోన్న ప్రాణ‌దాత‌లంటూ ప్రజలు వీరిని కీర్తిస్తున్నారు.

కరోనా రక్కసి ఒకవైపు భయపెడుతున్నా, ముఖానికి పెట్టుకున్న మాస్క్‌ జారి పోతుందనో, కళ్లద్దాలు కళ్లను సరిగా కవర్‌ చేస్తున్నాయో లేదోననో, చేతికున్న గ్లౌజులు సరిగా వున్నాయో లేదో అనే భయం వెంటాడుతున్నా, ఆరు గంటల పాటు ఏకధాటిగా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా, వాష్‌రూమ్‌లకు సైతం వెళ్లకుండా, శారీరకంగా, మానసికంగా ఆలసిపోతున్నా... ఒక లక్ష్యంతో, దీక్షతో కరోనా కురుక్షేత్రంలో పోరాడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులకు సేవలందించడంలో కేరళ నర్సులు ముందు వరుసలో వున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కేరళ నర్సులే ఎక్కువ మంది సేవలందిస్తున్నారు.

తెల్లని దుస్తులు, నెత్తిమీద చిన్నటోపీ, చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపులతో తిరుగుతూ, రకరకాల జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు ముందుగా మనోధైర్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులతో పాటు నర్సులు, ఆశావర్కర్లు, ఇతర వైద్య సిబ్బందిదే కీలక పాత్ర. తమ ప్రాణాలను పణంగా పెట్టి, కరోనాతో యుద్ధం చేస్తున్నారు. ఒక తపస్సులా సేవలందిస్తోన్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బందికి, వారి మానవత్వానికి పాదాభివందనం.