క‌రోనాపై సంపన్నదేశాల భీక‌ర‌పోరు, పేదదేశాలు బిక్కుబిక్కు!

కరోనా మహమ్మారిపై సంపన్న దేశాలు భీక‌ర పోరు చేస్తుంటే  ఆకలి దప్పులతో తల్లడిల్లే నిరుపేద దేశాలు క్షణక్షణం భయంతో అల్లాడిపోతున్నాయి. ఓ వైపు ధనిక దేశాలు కొవిడ్‌-19 తో ప్రాణాలొడ్డి పోరాడుతుంటే.. అత్యంత నిరుపేద దేశాల్లో భయోత్పాతం రగిలింది. నిత్యరక్తపాతంలో బిక్కుబిక్కుమంటూ ఆకలిదప్పులతో అల్లాడే శరణార్థ దేశాల్లోనే అత్యంత హాని తప్పదని అంతర్జాతీయ సంస్థలు ఆక్రోశిస్తున్నాయి. సిరియా, యెమెన్‌, సొమాలియా తదితర దేశాలను కరోనా వైరస్‌ కబళిస్తే…పరిస్థితి మరింత దైన్యమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐరోపా, అమెరికా దేశాలు కరోనావైరస్‌పై దూకుడు పెంచి.. యుద్ధం చేస్తుంటే…సిరియా, యెమెన్‌ తదితర యుద్ధ క్షేత్ర బరిలోనూ లక్షలాది మంది చనిపోతారని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్ర భయంకరంగా మారాయి.  క‌రోనా వైరస్‌ వ్యాపించి  వేలాది మందిని కబళించింది. 

ఆఫ్రికా ఖండంలో…ఇంకా కరోనా వైరస్‌ విజృంభణ ఊపందుకోలేదు. ఇప్పటికి కేవలం 3,200 మంది కరోనా వైరస్‌ కౌగిట్లో చిక్కుకోగా… 83 మంది ఊపిరి ఆగిపోయింది, ధనిక దేశాలతో పోల్చితే తమ ఖండంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉందని ఆఫ్రికన్‌ యూనియన్‌ తెలిపింది. 

ఇక్కడ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో పరిశుభ్రత పరిస్థితులు చాలా తక్కువ. నిరాశ్రయులై..సంక్షోభంలో అలమటించే శరణార్థులు కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోతారు” అని అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ప్రపంచంలోని అత్యంత హానికర ప్రాంతాల్లోని పేదలను ఆదుకునేందుకు 200 డాలర్ల ఆర్థిక సాయాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ మంజూరు చేసి.. ఒక మానవతా సహాయక ప్రణాళికను ప్రకటించారు. ”అయితే ఈ సాయం సరిపోదని మాకు ఇప్పటికే తెలుసు” అని ఉగాండా డైరెక్టర్‌ డెల్ఫిన్‌ పినాల్ట్‌ అన్నారు.
మహమ్మారిని ఎదుర్కోవటానికి పేద దేశాలను మరో సమస్య వేధించనుంది. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలు లేకపోవటమే ప్రధాన కారణం.