కొద్ది వారాల్లో వ్యాక్సిన్ రెడీ.. వారికే తొలి ప్రాధాన్యం

కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులపై శుక్రవారంనాడు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని చెప్పారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ ‌లైన్ వర్కర్లు, వయోవృద్ధులకు వ్యాక్సినేషన్‌ లో తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

 

వ్యాక్సిన్ ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు జరుపుతుందని అన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ టీకా ధర నిర్ణయిస్తామని వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు వ్యాక్సిన్ పంపిణీపై ప్రణాళికలు రూపొందిస్తున్నాయని తెలిపారు. కరోనాపై అన్ని రాజకీయ పక్షాలు తమ సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీల నుంచి వచ్చే సలహాలు, సూచనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అత్యంత చవకగా, భద్రమైన టీకా భారత్ నుంచి వస్తుందని తక్కిన ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.