కరోనా దేవికి పూజలు.. పిచ్చి పీక్స్...
Published on: Fri May 21, 2021 9:21PM
కరోనా వైరస్. కంటికి కనిపించని సూక్ష్మజీవి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాది మంది ఉసురు తీస్తోంది. కేవలం మనుషులకు మాత్రమే సోకుతోంది. పగబట్టినట్టు ప్రాణాలు తీస్తోంది. ముందు ముక్కులో చొరబడుతుంది. ఈ తర్వాత క్రమంగా ఊపిరితిత్తులను పాడు చేస్తోంది. మెళ్లిగా ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలను బలిగొంటోంది. ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణం తీసేది యముడు. మరి, యముడిని ఎవరైనా పూజిస్తారా? గుడికట్టి ఆరాధిస్తారా? దేవుడు, యముడు సంగతి పక్కనపెడితే.. వైరస్‌కు ఎవరైనా గుడి కడతారా? ప్రాణాలు తీస్తున్న మహమ్మారికి విగ్రహం పెట్టి.. పూజలు చేసి.. ఆరాధిస్తారా? చేయనే.. చేయరు కదా. కానీ.. తమిళనాడుకు చెందిన కొందరు అలా చేస్తున్నారు. కరోనా దేవికి పూజలు చేస్తూ.. చాదస్తం చాటుకుంటున్నారు.
ఏ విషయంలోనైనా ఓవర్ చేయడంలో తమిళుల తర్వాతే ఎవరైనా. సినీ నటి ఖుష్బూ, త్రిష, అజిత్‌లాంటి వాళ్లకు గుళ్లుకట్టి పూజలు చేయడం వారికే చెల్లింది. తమ అభిమానాన్ని, భయాన్ని.. విగ్రహాలు, ఆలయాల రూపంలో వ్యక్తం చేయడంలో వారికి వారే సాటి.
తమిళనాడులో తమ అభిమాన సినీ, రాజకీయ ప్రముఖలకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆలయాలను నిర్మించి పూజలు చేయడం పరిపాటే. తాజాగా కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. కోయంబత్తూరులో ఓ ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామాక్షిపురి ఆలయంలో ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
కేవలం విగ్రహాన్ని ప్రతిష్టించడమే కాదు.. 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మహాయాగం చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కరోనా దేవి ఆలయమైనా.. కరోనా కాలం కాబట్టి.. యాగం సమయంలో భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించబోమని తెలిపారు.
గతంలో కూడా కలరా, తట్టు, మసూచీ వంటి వ్యాధులు ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మగలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజాలు చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో.. కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు తమిళ తంబిలు. వాళ్ల పిచ్చి పీక్స్‌కు చేరిందంటున్నారు చూసినవాళ్లు.


