కరోనా ఖతం!.. 50వేల దిగువకు కేసులు
Published on: Mon Feb 14, 2022 12:24PM
భారతదేశ ప్రజలకు ఊరటనిచ్చే వార్త ఇది. దేశంలో కరోనా కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొంత కాలంగా కరోనా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతుండడంతో మహమ్మారి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50 వేలకు దిగువన 34 వేల 113 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు పైగా తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజాగా లెక్కలు చెబుతున్నాయి. దీంతో పాటు రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 3.19 శాతానికి దిగి రావడం ఊరటనిచ్చే అంశం. కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడా ముందటి రోజు కంటే సగానికి తగ్గడం గమనార్హం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 346 మంది కరోనాతో మరణించారు. అంతకు ముందు రోజు 680 మంది మరణించారు. దీంతో భారత దేశంలో కరోనా మూడో వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్న వైనానని గమనించవచ్చు.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 78 వేల 882 గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 1.12 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 172.95 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇంతవరకు 1.73 కోట్ల మందికి ప్రికాషనరీ డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా లక్షా 17 వేల 591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీల సంఖ్య 4 కోట్ల 16 లక్షల 77 వేల 641 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 49.16 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.


