విమానయాన రంగానికి గడ్డుకాలం

చతికిల పడ్డ ఆకాశయానం

పార్కింగ్ కోసం ఫ్లైట్స్ కు తప్పని ఫైట్

కంటికి కనిపించని వైరస్ దాడితో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోయాయి. అందులో విమానయాన రంగం ఒకటి.  ఒకప్పుడు ధనికులకే అందుబాటులో ఉండేది ఆకాశయానం. గత కొన్నేండ్లుగా ప్రైవేటు విమాన సంస్థల మధ్య నెలకొన్న పోటీతో మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి వచ్చింది. పోటీలు పడీ మరీ ధరలను తగ్గించి.. స్పెషల్ ఆఫర్స్ తో దిగువ మధ్యతరగతి వారిని సైతం మేఘాల్లో విహరించేలా చేసింది. అలాంటి విమానయాన రంగం కరోన కారణంగా చతికిలపడింది. ప్రపంచ రవాణావ్యవస్థలో అత్యధిక లాభాలతో దూసుకు పోయిన గత దశాబ్దాన్ని వైమానిక రంగం స్వర్ణయుగంగా ఎంతో మంది అభివర్ణించారు. ఈ పదేళ్లుగా మంచి పురోగతిని సాధిస్తూ ఏటా అంతకంతకు వృద్ధి చెందింది. 2020లో 870 బిలియన్ డాలర్ల పైనా ఆదాయం వస్తుందని అంచనా వేస్తే ఇప్పటికి వచ్చింది కేవలం 419 బిలియన్ డాలర్లు మాత్రమే. దేశీయంగా సైతం చిన్నచిన్న విమానాలతో రవాణా సమయాన్ని ఆదా చేసిన విమానాలు ఇప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లా ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి.

కరోనా మహమ్మారి విజృంభించక ముందు ప్రపంచ రవాణా రంగం ఊపులో ఉండేది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ విధించడం, కొత్తగా తమ తమ దేశాల్లోకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అన్న విధంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో కొత్తగా ఎవరూ టికెట్స్ బుక్ చేసుకోకపోవడం..ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేశారు. జనవరి - జులై మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడున్నర లక్షల విమానాలు రద్దు అయ్యాయి. దాంతో విమానయాన సంస్థలు కోలుకో లేని నష్టాలు చవిచూశాయి. విమానాలు అన్నీ ఎయిర్ పోర్ట్ లకే పరిమితం కావడంతో చివరకు ఆ విమానాలను పార్కింగ్ చేసే స్థలం కోసం కూడా తగువులాడే పరిస్థితి వచ్చింది.

 

 

 

 

 

 

 

 

పర్యాటకం పైనే ఆధారపడే చాలా విమానయాన సంస్థలు మూతపడే స్థితికి వచ్చాయి. థాయ్ ఎయిర్ వేస్, లుఫ్తాన్సా, లాటన్ వంటి సంస్థలు దాదాపుగా పతనావస్థకు చేరుకున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటి దారి పట్టారు. మరి కొందరి వేతనాల్లో కోతలు విధించారు. విమాన ప్రయాణాల్లో వచ్చిన ఈ విపత్కర పరిస్థితి విమాన తయారీ సంస్థలపై కూడా ప్రభావం చూపింది. ప్రపంచంలోనే  విమానయాన తయారీలో అత్యంత పేరున్న బోయింగ్ సంస్థ దాదాపు 16000 వేల మందిని, ఎయిర్ బస్ 15000 మందిని ఇప్పటికే ఉద్యోగాల నుండి తొలగించాయి.

2001 సెప్టెంబర్ 11 లో విమానాల హైజాక్ తర్వాత ఎయిర్ ఫోర్టుల్లో వైమానిక మార్గదర్శకాలను అనుసరించి స్క్రీనింగ్ చేయడంలో, కాక్ పీటీలోకి ఎవరిని అనుమతించక పోవడం లాంటి నియమాలు పాటిస్తూ నిబంధనలను కఠినతరం చేశారు.  గతంలో ఒక ప్రయాణికుడు తన షూ లో దాచిన ఆయుధంతో  తోటి ప్రయాణికులను భయపెట్టి హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంగ్లాడ్ లో మరో  ప్రయాణికుడు ద్రావణం రూపంలో ఉన్న పేలుడు సామాగ్రిని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించాడు. ఇలాంటి ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలను చాకచక్యంతో ఎయిర్ ఫోర్ట్ రక్షణా సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కంటికి కనిపించని వైరస్ ను ఎదుర్కోవడానికి మరిన్ని జాగ్రత్తలు అవసరం అయ్యాయి.  మాస్కులు, ఫేస్ షిల్డ్స్,  స్క్రినింగ్, ప్రొటెక్టివ్ గేర్స్, , హాండ్ శానీటైజర్ వంటివి తప్పనిసరిగా మారింది. వీటితో పాటు తమ విమానాల్లో ప్రయాణం సురక్షితం అని ప్రయాణికుల్లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోయింగ్ లాంటి సంస్థలు HEPA ఫిల్టర్స్ ద్వారా 99 శాతం వైరస్ ను నాశనం చేసే చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి.  ప్రయాణికులు తీసుకునే ఆహారం విషయంలో, టాయిలెట్స్, బాత్ రూమ్స్ వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

సోషల్ డిస్టెన్సింగ్ వంటివి కొంత కష్టం అయినప్పటికీ తప్పని పరిస్థితిలో వెస్ట్ జెట్(WestJet), ఎయిర్ కెనడా(Air Canada) వంటి సంస్థలు సోషల్ డిస్టెన్స్ ను అమలు చేస్తున్నాయి. అయితే దీనితో ప్రయాణికులపైనే అదనపు భారం పడుతుంది.

కరోనా కన్న ముందు కొన్ని సంస్థలు విహార యాత్ర చేయాలనుకునే  ప్రయాణికులను ఆకట్టుకోవడానికి 40 శాతం వరకు టికెట్ లో రాయితీ  ఇచ్చాయి. దాంతో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండేది. ఉదాహరణకు బార్సిలోనా విషయానికి వస్తే గత సంవత్సరం ఈ నగరం ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఒక దశలో స్థానికులు విసిగిపోయి ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు అని బ్యానర్లు కట్టే పరిస్థితి వచ్చింది. ఎవరెస్టు శిఖరం పైన కూడా టూరిస్టులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదంతా కూడా విమానయాన రంగంలో ఏర్పడిన పోటీతో తక్కువ రేట్ కు టికెట్లు అందుబాటులోకి తీసుకురావడంతోనే ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా విమానయాన సంస్థలు లాభాదాయకంగా ఉన్న మార్గాల ద్వారానే విమానాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  మన దేశం వందే భారత్  మిషన్ ద్వారా కొన్ని దేశాలకు విమానాలు నడుపుతుంది. బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్ 777ను రద్దు చేసింది.  కెనెడియన్ ఎయిర్ లైన్స్  పరిమిత మార్గాల్లోనే విమానాలు నడపడానికి సిద్ధపడింది. విమానయాన రంగం ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటపడి  నిండుగా ఉన్న ప్రయాణికుతో స్వేచ్ఛగా గాలిలోకి ఎగరాలంటే మరి కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదేమో..!!