కేరళలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క వారంలోనే 40 వేల కొత్త కేసులు 

భారత్ లో మొట్టమొదటి కరోనా కేసు కేరళలోనే నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తోలి రోజుల్లో పాజిటివ్ కేసులు అధికంగానే నమోదైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసింది. అయితే తాజాగా కేరళలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 40 వేల కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. కేరళ లో ముఖ్యమైన పండగ ఓనమ్ సందర్భంగా నిబంధనలను సడలించడం తో పాటు దేవాలయాలను తెరవడం వంటి కారణాలు, మరో పక్క ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం కేసుల పెరుగుదలకు కారణమని ప్రభుత్వ వైద్య వర్గాలు తెలిపాయి.

 

దీంతో వచ్చే నెలలో కేరళలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తాజాగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టెస్ట్ పాజిటివ్ రేటు సగటున 8 శాతం ఉండగా, కేరళలో మాత్రం 11.9 శాతంగా ఉందని ఆమె గుర్తు చేశారు. కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుండి మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, తాము తీసుకున్న చర్యలతోనే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువగా ఉందని ఆమె అన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని ముందుగానే అంచనా వేశామని ఆమె తెలిపారు. కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేయకుండా రాష్ట్ర ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని మంత్రి శైలజ సూచించారు. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 860 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, అందులో కూడా 15 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని ఆమె అన్నారు. అంతేకాకుండా కొంతమంది బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని, దీనిపై ప్రజలు కనుక సహకరించకపోతే మరోసారి లాక్ డౌన్ విధిస్తామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.