TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలో ఆందోళన రేపుతోన్న కరోనా కేసులు..అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచన

Published on: Tue May 20, 2025 3:46PM

 

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్  దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్‌-1, ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ముంబైలో ఇద్దరు మహిళల మరణం తీవ్ర కలకలం రేపింది. వీరు కరోనా కారణంగానే మృతి చెందారంటూ వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్  స్పందించి, ఈ వార్తలను ఖండించింది. 

సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించిన మాట వాస్తవమే అయినా, వారి మృతికి కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. తాజాగా కోవిడ్ భారిన పడిన బాధితులలో కొందరు తాము తీవ్ర అలసటతో బాధపడుతున్నారు. వర్షాకాలం వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. 

ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.