నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ మార్క్ సమావేశం

 

కాంగ్రెస్ పని ఎప్పుడు కూడా కొండను త్రవ్వి ఎలకను పట్టినట్లుగానే ఉంటుందని ఈ రోజు మరోమారు ఋజువు చేసింది. ఈ రోజు సమావేశమయిన కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనపై ఏదో ఒక ఖచ్చితమయిన ప్రకటన చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నవారందరికీ, ముఖ్యంగా తెలంగాణా ప్రజలని, తెలంగాణా నేతలని తీవ్ర నిరాశకు గురిచేస్తూ ఎటువంటి ప్రకటన చేయకుండా, “తెలంగాణా అంశంపై కోర్ కమిటీలో లోతుగా చర్చ జరిగిందని, ఇక ఈ విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొంటామని” పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ అని క్లుప్తంగా శలవిచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో వారం పది రోజులో సమావేశం అయ్యే అవకాశం ఉంది. గనుక ఈ సస్పెన్స్ స్టోరీ మళ్ళీ మరికొన్ని రోజులు పొడిగించబడింది. ఈ రోజు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ తప్పని సరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకొంటుందని అందరూ భావించినప్పటికీ, కాంగ్రెస్ పద్దతుల గురించి ఔపోసన పట్టిన తెదేపా, తెరాసలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా కాంగ్రెస్ ఈ సమావేశంలో ‘మరో మారు సమావేశం అవ్వాలని’ మాత్రమే ఒక ఖచ్చితమయిన నిర్ణయానికి రాగలిగింది.