TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూపర్ కనోలీ హీరోచిత పోరాటం.. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ

Published on: Wed Apr 1, 2026 6:36AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్   బోణీ కొట్టింది. మంగళవారం (మార్చి 31) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే  తమ విజయాల ఖాతా  తెరిచింది. పంజాబ్ విజయంలో యువ బ్యాటర్ కూపర్ కనోలీ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించి జట్టును గెలిపించాడు.

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్  బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 39పరుగులు, జోస్ బట్లర్  38 పరుగులతో ఓ మోస్తరుగా రాణించినా, పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వారిని కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.  స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఒక దశలో సునాయాసంగా గెలిచేస్తుందనిపించినా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్  37 పరుగులు చేసి ఒటైన తరువాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు.   కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకానొక దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.  అయితే యువ ఆటగాడు కూపర్ కనోలీ  44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 72 నాటౌట్ తో   ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో జేవియర్ బార్ట్‌లెట్  5 బంతుల్లో 11 నాటౌట్  మెరుపులు మెరిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది.

కనోలీ కేవలం 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.   ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీసినప్పటికీ, కనోలీ ఇన్నింగ్స్ ముందు అది వృధా అయింది.