టీటీడీ బోర్డులో ఎస్సీ ఎస్టీల కోటా ఎక్కడ? జగన్ వి ఉత్తి మాటలేనా?

 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై వివాదం రాజుకుంటోంది. సుమారు వందేళ్ల టీటీడీ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా 29మందితో జంబో బోర్డును నియమించిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 29మందికి అదనంగా మరో ఏడుగురికి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ బోర్డులో సభ్యులు ఎక్కువయ్యారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ విమర్శలు చెలరేగుతుండగా, ఇఫ్పుడు అదనంగా మరో ఏడుగురికి చోటు కల్పించడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మండిపడుతున్నారు.

29మందితో జంబో బోర్డు ఏర్పాటుచేసిన జగన్ ప్రభుత్వం.... తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్‌సింహా, శేఖర్‌, కుపేందర్‌రెడ్డి, గోవింద హరి, దుష్మంత్ కుమార్‌, అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో ఇచ్చింది. మిగతా సభ్యుల్లాగే వీళ్లకూ టీటీడీ ప్రోటోకాల్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి చోటు కల్పించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి నివాసం నుంచి వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెనుసంచలనమైంది. అప్పుడు శేఖర్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం అతడిని బోర్డు నుంచి తొలగించింది. అంతేకాదు శేఖర్ రెడ్డిని తొలగించాలంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా డిమాండ్ చేసింది. అయితే, అదే శేఖర్ రెడ్డికి ఇఫ్పుడు టీటీడీ బోర్డులో వైసీపీ సర్కార్ చోటు కల్పించడం ఆశ్చర్యంగా మారింది.

ఇక, టీటీడీలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. అసలే 29మందితో జంబో టీమ్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం.... అది చాలదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో మరికొందరికి చోటు కల్పించడంపై భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈసారి ప్రకటించిన పాలక మండలిలో రాష్ట్రేతరులకే పెద్ద పీట వేశారు. అలాగే అన్ని దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న జగన్.... తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.